ఎస్‌ఐఆర్‌తో 11.85 శాతం ఓట్లు రద్దు
ముస్లింల మెజార్టీ కలిగిన ముర్షిదాబాద్‌లో అత్యధికంగా ఓట్ల తొలగింపు
ఓట్ల తొలగింపునకు గురైన బాధితులకు అండగా ఉంటామన్న మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వేతో దాదాపు 91 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు తాజాగా గణాంకాలను విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో ఎస్‌ఐఆర్ ప్రారంభం కాకముందు బెంగాల్‌లో 7.66 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎస్‌ఐఆర్‌తో 90.83 లక్షల మంది పేర్లు తొలగింపునకు గురయ్యాయి. అంటే 11.85 శాతం ఓట్లు రద్దయినట్లు తెలుస్తోంది. 60.06 లక్షల ఓటర్ల పేర్లను న్యాయ పరిశీలనలో ఉంచారు.
వీటిపై జ్యుడీషియల్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. 27.16 లక్షల పేర్లను తొలగించారు. అంటే 45.22 శాతం ఓట్లు రద్దయినట్లు స్పష్టమవుతోంది. న్యాయ పరిశీలనలో ఉన్న 32.68 లక్షల ఓటర్ల పేర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చారు. ఆ ఓట్లు సక్రమమేనని తేల్చారు. ముస్లింల జనాభా అధికంగా ఉన్న ముర్షిదాబాద్‌లోనే అత్యధికంగా ఓట్లు రద్దయ్యాయి. ఇక్కడ 4.55 లక్షలకుపైగా ఓటర్ల పేర్లు తొలగించారు.
బంగ్లాదేశ్ సరిహద్దులోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో 3.25 లక్షల ఓట్లను రద్దు చేశారు. మాల్డాలో 2.39 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలో 2.23 లక్షలు, పూర్బ బర్దమాన్ జిల్లాలో 2.09 లక్షలు, నాడియా జిల్లాలో 2.98 లక్షల మందికి ఓటు వేసే అర్హత లేదని తేల్చేశారు. కోల్‌కతా సౌత్‌లో 28,000 ఓట్లు తొలగించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 23, 29న జరుగనున్నాయి. కొత్త ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చడం ఇప్పుడు సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసే వీలుంటుందని తేల్చిచెప్పింది.
ఓటర్లపై కేంద్రం వివక్ష: మమత
ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్ల తొలగింపు పట్ల పశ్చి మ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితులకు అండగా ఉంటామని మంగళవారం నాదియా జిల్లాలో ఎన్నికల సభలో పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ అనంతరం సైతం మతువా, మైనార్టీల ఓట్లు తొలగించారని ఆరోపించారు. ‘‘కేంద్రం వివక్ష ప్రదర్శించింది. కొన్ని సామాజిక వర్గాలే లక్ష్యంగా కోట్లు తొలగించారు.
మతువా, రాజ్‌బన్షీలు, మైనార్టీలపై విద్వేషం ఎందుకు?’’ అని ప్రశ్నించారు. మైనారిటీ జనాభా అధికంగా ఉన్న ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్ వంటి జిల్లాల్లో ఓటర్ల పేర్లను తలలో పేలను ఏరివేసినట్లుగా ఏరివేశారని మమత ధ్వజమెత్తారు. ఓటర్లను విభజించడమే బీజేపీ మతంగా మారిపోయిందన్నారు. ఇలా చేయడం హిందూయిజం కాదని స్పష్టంచేశారు. మమత ఆరోపణలను బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తిప్పికొట్టారు. బంగ్లాదేశ్ ముస్లింలకు బెంగాల్‌లో స్థానం లేదని తేల్చిచెప్పారు.


