అస్సాం, కేరళలో ప్రచారానికి తెర | Campaigning ends in Assam and Kerala Assembly elections | Sakshi
Sakshi News home page

అస్సాం, కేరళలో ప్రచారానికి తెర

Apr 8 2026 5:06 AM | Updated on Apr 8 2026 5:06 AM

Campaigning ends in Assam and Kerala Assembly elections

తిరువనంతపురం/గువాహటి/చెన్నై: కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెర పడింది. వాటితో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ మైకులు మూగబోయాయి. మూడు అసెంబ్లీలకూ గురువారం ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేసింది. మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనుంది. కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. మంగళవారం చివరి రోజు కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ప్రధాన పార్టీలన్నీ ముమ్మర ప్రచారంతో హోరెత్తించాయి. సభలు, రోడ్‌ షోలు, ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి నిమిషందాకా ప్రయత్నించాయి. కేరళలోనైతే కొన్ని చోట్ల అభ్యర్థులు క్రేన్లపైకి ఎక్కి మరీ ప్రసంగాలు చేశారు! 

హోరాహోరీ పోరు 
కేరళలో మూడు కూటములు బరిలో ఉన్నా పోరు ప్రధానంగా సీపీఎం సారథ్యంలోని అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్‌ కూటముల మధ్యే కేంద్రీకృతమైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా గట్టిగా ఉనికి చాటుకోవాలని పట్టుదలగా ఉంది. నెల రోజులపాటు పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఎన్డీఏ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పలుమార్లు రాష్ట్రంలో పర్యటించగా కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌గాం«దీ, ప్రియాంకా గాంధీ వాద్రా స్టార్‌ ప్రచారకులుగా నిలిచారు.

ఎల్డీఎఫ్‌ కూటమి ప్రచారం ప్రధానంగా సీఎం విజయన్‌పైనే ఆధారపడి సాగింది. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ ఈసారి ప్రాధాన్యమివ్వడం విశేషం. అస్సాంలో ఈసారి కూడా నెగ్గి హ్యాట్రిక్‌ కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎప్పట్లాగే అవి రెండూ పలు ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి బరిలో దిగాయి. బీజేపీ తరఫున మోదీ, అమిత్‌ షా, కాంగ్రెస్‌ నుంచి రాహుల్, పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే విస్తృతంగా ప్రచారం చేశారు. మోదీ, అమిత్‌ షా పుదుచ్చేరిలో కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పుదుచ్చేరిలో ఎన్నికలు పాలక ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటములకు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. 

ప్రచారం కొత్త పుంతలు 
ప్రచారంలో పలువురు నేతలు కొత్త పుంతలు తొక్కారు. కేరళలో పుత్తుపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి ఛండీ ఒమెన్‌ నియోజకవర్గమంతటినీ పలుమార్లు సైకిల్‌పై చుట్టేశారు. ఓటర్లను నేరుగా కలుసుకుంటూ ప్రచారం కొనసాగించిన తీరు రాహుల్‌ తదితర నేతలను ఆకర్షించింది. పాలక్కాడ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ పిషరోడీ గోడలపై రోబోలతో రాతలు రాయించారు. 

Advertisement
 
Advertisement
Advertisement