తొలిసారిగా భూ అస్తమయం! | Earthset and a solar eclipse: Nasa releases first images from Moon fly-by | Sakshi
Sakshi News home page

తొలిసారిగా భూ అస్తమయం!

Apr 8 2026 4:35 AM | Updated on Apr 8 2026 4:35 AM

Earthset and a solar eclipse: Nasa releases first images from Moon fly-by

చంద్రుని వెనకగా భూమి అస్తమిస్తున్న అరుదైన దృశ్యం. దీన్ని ఒరియాన్‌ వ్యోమ నౌక తాజాగా కెమెరాలో బంధించింది

అరుదైన సూర్యగ్రహణం 

చంద్రబిలాల విశేషాలు 

మూడు దృగ్విషయాలను కెమెరాలో బంధించిన ఆర్టిమిస్‌–2 వ్యోమగాములు

హూస్టన్‌: అత్యంత సుదూరాలకు మానవసహిత వ్యోమనౌక మిషన్‌ను విజయవంతంగా పూర్తిచేసి కొత్త చరిత్ర సృష్టించిన ఆర్టీమిస్‌–2 ప్రాజెక్ట్‌ వ్యోమగాములు ఒరియాన్‌ వ్యోమనౌక నుంచి అరుదైన విషయాలను తమ మదిలో, కెమెరాల్లో నిక్షిప్తంచేసుకుని భూమికి తిరుగు ప్రయాణం ఆరంభించారు. సోమవారం రాత్రి 11.30 గంటలప్పుడు చంద్రుని ఆవలివైపునకు చేరి చరిత్రలో తొలిసారిగా ఏకధాటిగా దాదాపు ఏడుగంటలపాటు చందమామ అవతలివైపు ప్రాంతాలు, బిలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. చంద్రతలం నుంచి దాదాపు 6,545 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ వాటి ఫొటోలను వ్యోమగాములు రీడ్‌ వైస్‌మ్యాన్, విక్టర్‌ గ్లోవర్, క్రిస్టినా కూచ్, జెరెమీ హాన్సెన్‌ తమ శక్తివంత నికాన్‌ కెమెరాలు, ఐఫోన్లలో బంధించారు.

ఈ ఫొటోలను నాసా విడుదలచేసింది. ఈ సందర్భంగా చంద్రుని అంచు వెనకాల భూమి అస్తమిస్తున్న ఫొటోనూ ఆర్టీమిస్‌–2 కమాండర్‌ రీడ్‌ వైస్‌మ్యాన్‌ తమ ఒరియాన్‌ ‘ఇంటిగ్రిటీ’క్యాప్సూల్‌ కిటికీ గుండా తీశారు. ఇదేకాకుండా వ్యోమగాములకు సూర్యునికి మధ్యలో చందమామ అడ్డుగా వచ్చి ఏర్పడిన అత్యంత అరుదైన సూర్యగ్రహం ఉది్వగ్నభరత క్షణాలను సైతం ఆస్ట్రోనాట్స్‌ తమ కెమెరాల్లో బంధించారు. ఈ చిమ్మచీకట్లో వెనక వైపు నుంచి మెరుస్తూ కన్పించిన బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శనిగ్రహాల ఫొటోలనూ తీశారు. అర్ధశతాబ్దం క్రితం అపోలో12, అపోలో 14 మిషన్‌లో భాగంగా దిగ్గజ వ్యోమగాములు చంద్రునిపై దిగిన ల్యాండింగ్‌సైట్‌లనూ వ్యోమగాములు పరిశీలించారు.

ఈ సందర్భంగా గతేడాది మరణించిన అపోలో–8 మిషన్‌లో భాగస్వామి, మాజీ వ్యోమగామి జిమ్‌ లావెల్‌తో గతంలో రికార్డ్‌చేయించిన సందేశాన్ని వ్యోమగాములకు నాసా పంపించింది. ‘‘చరిత్రాత్మక రోజు ఇది. ప్రయోగాలు చేస్తూ బిజీగా ఉంటారేమో. అయినాసరే అక్కడి నుంచి అందాలను వీక్షించడం మానకండి’’అని ఆయన సందేశం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రుని ఆవలివైపు తొలిసారిగా తాము చూసిన ఒక బిలానికి ఇటీవల కన్నుమూసిన తోటి వ్యోమగామి వైస్‌మ్యాన్‌ భార్య కరోల్‌ పేరును పెట్టారు. ఈ సందర్భంగా నలుగురు వ్యోమగాములు కంటతడి పెట్టుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement