శబరిమలలో మహిళలపై నిషేధం సబబే | Centre backs restriction on women Sabarimala entry in SC | Sakshi
Sakshi News home page

శబరిమలలో మహిళలపై నిషేధం సబబే

Apr 8 2026 4:52 AM | Updated on Apr 8 2026 4:52 AM

Centre backs restriction on women Sabarimala entry in SC

సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కేంద్రం వాదనలు

న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం సబబేనని కేంద్రం పేర్కొంది. ‘‘మతపరమైన విశ్వాసానికి సంబంధించిన విషయమిది. కనుక న్యాయపరమైన సమీక్షకు అతీతమైనది’’అని స్పష్టం చేసింది. మతపరమైన ప్రార్థన స్థలాల్లోకి మహిళల ప్రవేశంపై వివక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కీలక విచారణ ప్రారంభించింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు విన్పించారు. శబరిమలలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఒకరకమైన అంటరానితనమేనంటూ 2018లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.

‘‘అది తప్పుడు తీర్పు. కనుక దాన్ని పునఃపరిశీలించాల్సిందే’’అని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 25 ప్రసాదించిన మతపరమైన స్వేచ్ఛను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. మతపరమైన విశ్వాసం ముసుగులో కొనసాగే సామాజిక రుగ్మతలను పరిశీలించే అధికార పరిధి కోర్టులకు ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. దానితో ఏకీభవిస్తున్నట్టు మెహతా చెప్పారు. మతపరమైన ఆచారాలు శాంతిభద్రతలకు, ఆరోగ్యానికి, నైతికతకు విఘాతం కలిగిస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చన్నారు. మహిళలను నెలలో మూడు రోజుల పాటు అంటరానివారిగా చూడటం సరికాదని జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు. ఈ విషయమై తానొక మహిళగా మాట్లాడుతున్నట్టు చెప్పారు.

శబరిమల ఆలయంలోకి మహిళలపై నిషేధం వయసుకు సంబంధించిందే తప్ప రుతుస్రావానికి సంబంధించిన అంశం కాదని మెహతా బదులిచ్చారు. ‘‘దీనిపై స్పష్టత అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప ఆలయాల్లోకీ మహిళలకు ప్రవేశముంది. ఒక్క శబరిమల ఆలయంలో మాత్రమే దానిపై ఆంక్షలున్నాయి’’అని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘భారత్‌లో మహిళలు ఎప్పుడూ పురుషులతో సమానంగా హోదా, మన్నన అందుకున్నారు. కొన్నిసార్లు వారికే ప్రాధాన్యం దక్కింది. మహిళలను పూజించే ఏకైక సమాజం మనదే. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సహా అందరమూ దేవీ విగ్రహాలకు మొక్కుతాం.

కనుక పురుషాధిక్యత, లింగ సమానత్వం వంటి అంశాలను ఈ కేసులో చొప్పించరాదు’’అని వాదించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని 2018లో ఐదుగరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనడం తెలిసిందే. అంతేగాక నిషేధాన్ని తొలగిస్తూ 4:1 మెజారిటీతో తీర్పు కూడా వెలువరించింది. ‘‘మేమిప్పుడు ఆ తీర్పు తాలూకు మంచిచెడుల్లోకి పోదలచుకోలేదు. ఈ అంశానికి సంబంధించి రూపొందించిన ఏడు ప్రశ్నలకు మాత్రమే విచారణ పరిధిని పరిమితం చేస్తున్నాం’’అని ధర్మాసనం స్పష్టం చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement