10వ తేదీ నుంచి టోల్‌ప్లాజాల వద్ద నో క్యాష్‌ | No more cash payments at toll plazas from April 10 | Sakshi
Sakshi News home page

10వ తేదీ నుంచి టోల్‌ప్లాజాల వద్ద నో క్యాష్‌

Apr 8 2026 4:41 AM | Updated on Apr 8 2026 4:41 AM

No more cash payments at toll plazas from April 10

ఫాస్టాగ్‌తోనే చెల్లింపులు 

ఫాస్టాగ్‌ లేకుంటే యూపీఐతో 1.25 రెట్లు అధికంగా చార్జీ వసూలు 

న్యూఢిల్లీ: ఫాస్టాగ్‌ విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి జాతీయరహదారులపై టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపేయనుంది. కేవలం ఫాస్టాగ్‌ ద్వారానే చెల్లింపులను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనాలకు ఫాస్టాగ్‌ను అతికించకపోతే యూపీఐ విధానం ద్వారా టోల్‌ రుసుమును చెల్లించవచ్చు. కానీ వాస్తవిక రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా టోల్‌ చార్జీని చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.

ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఫాస్టాగ్‌ విధానంలో మాత్రమే టోల్‌ప్లాజా గేట్ల వద్ద ఎలాంటి క్యూ సమస్యలు తలెత్తబోవని, అందుకే ఫాస్టాగ్‌ను ప్రోత్సహిస్తున్నామని మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు. వ్యాలిడిటీ దాటిపోయిన ఫాస్టాగ్‌లతో వచ్చే వాహనాల టోల్‌చార్జీలను యూపీఐ విధానంలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. ఫాస్టాగ్‌ లేదా యూపీఐ విధానంలోనూ చెల్లింపులు జరపని వాహనాలను 14వ నిబంధన మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారి స్పష్టంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement