
న్యూఢిల్లీ: పాకిస్తాన్ తరఫున గూఢచర్యం చేస్తున్న ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు సీఆర్పీఎఫ్ జవాన్‌ను అరెస్ట్ చేశారు. సీఆర్పీఎఫ్ ఢిల్లీ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మోతీ రాం జాట్ జాతి భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారుల
(పీఐఓ)కు అందజేస్తున్నాడని ఎన్‌ఐఏ సోమవారం తెలిపింది.
వివిధ మార్గాల ద్వారా పీఐవోల నుంచి ప్రతిఫలం అందుకుంటున్నట్లు గుర్తించామని వివరించింది. నిబంధనల ప్రకారం ఈ ఏడాది మే 21వ తేదీ నుంచి ఇతడిని విధుల నుంచి తొలగించినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది. ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం జాట్‌ను జూన్ 6వ తేదీ వరకు కస్టడీకి అనుమతించింది.