సెకండ్‌ వేవ్‌ ముగిసినట్లేనా?

COVID Wave 2 Over on Positivity Rate Below 5percent - Sakshi

5 శాతం కంటే దిగువకు పడిపోయిన పాజిటివిటీ రేటు

ముగింపు ఇప్పుడే కాదంటున్న నిపుణులు

కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి.. జాగ్రత్తలు కొనసాగించక తప్పదు   

న్యూఢిల్లీ: కరోనా పాజిటివిటీ రేటులో భారత్‌ ముఖ్యమైన మైలురాయిని దాటింది. దేశంలో వరుసగా 14వ రోజు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువే నమోదయ్యింది. అంటే ప్రతి 100 టెస్టుల్లో 5 శాతంలోపే పాజిటివ్‌గా తేలుతున్నాయి. వ్యాప్తి తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. అయితే, పరిస్థితి ఆశాజనంగా మారినట్లు ఇప్పుడే నిర్ణయానికి రావొద్దని సైంటిస్టులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనాలో కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని, జాగ్రత్తలు కొనసాగించక తప్పదని సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా గణాంకాలను నమ్మలేమని అంటున్నారు.

ఇంకా సమయం ఉంది
‘సెకండ్‌ వేవ్‌ ముగింపు ఇప్పుడే కాదు. డెల్టా ప్లస్‌ లాంటి వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి కాబట్టి ఈ వేవ్‌ అంతం కావడానికి ఇంకా సమయం ఉంది’ అని ఢిల్లీలోని శివనాడార్‌ వర్సిటీకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ నేచురల్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నాగసురేష్‌ వీరపు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫస్టు వేవ్‌ ముగిసిందన్న భావనతో జనం నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇంతలోనే సెకండ్‌ వేవ్‌ విరుచుకుపడిందని గుర్తుచేశారు. ఫస్ట్‌వేవ్‌లో పాజిటివిటీ రేటు ఒక శాతంగా ఉన్నప్పుడు సెకండ్‌ వేవ్‌ మొదలైందన్నారు. కేసుల సంఖ్య తగ్గింది అంటే సెకండ్‌ వేవ్‌ ముగిసినట్లు కాదని చెప్పారు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కరోనా బాధితులు కొందరు పరీక్షలు చేయించుకోవడం లేదని గుర్తుచేశారు. రోజువారీ కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తుండడానికి ఇది కూడా ఒక కారణమని పేర్కొన్నారు.

దేశమంతటా పాజిటివిటీ రేటు తగ్గితేనే..
దేశంలో కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే అధికంగా ఉందని ఢిల్లీకి చెందిన వైద్య నిపుణుడు చంద్రకాంత్‌ లహరియా తెలిపారు. రోజువారీ పాజిటివ్‌ కేసులు  అధికంగా∙నమోదవుతున్నాయన్నారు. దేశమంతటా అన్ని ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తగ్గేదాకా వేచిచూడాలని, ఇది రెండు వారాల కంటే ఎక్కువ రోజులు కొనసాగితేనే సెకండ్‌ వేవ్‌ అంతమవుతున్నట్లు గుర్తించాలన్నారు. కేరళలో ఆదివారం పాజిటివిటీ రేటు 10.84 శాతం నమోదు కావడం గమనార్హం.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top