corona virus: ఆర్‌ ఫ్యాక్టర్‌ పెరుగుతోంది

COVID-19 R-Value more than 1 in 8 States and UTs Coronavirus spreading rapidly here - Sakshi

ఆర్‌ ఫ్యాక్టర్‌ (రీప్రొడక్టివ్‌ నంబర్‌) పెరుగుతోంది: కేంద్రం ఆందోళన

కొత్తగా 42,625 మందికి కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వృద్ధిని తెలియజేసే ఆర్‌ ఫ్యాక్టర్‌ (రీప్రొడక్టివ్‌ నంబర్‌) పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. తమిళనాడు, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్, కశ్మీర్‌ సహా 8 రాష్ట్రాల్లో ఆర్‌ ఫ్యాక్టర్‌ ఒకటి కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. కోవిడ్‌ సోకిన ఒక వ్యక్తి సగటున ఎంతమందికి వ్యాధిని వ్యాప్తి చేస్తున్నాడన్న విషయాన్ని వైద్య పరిభాషలో ఆర్‌ ఫ్యాక్టర్‌గా చెబుతారు. ఆర్‌ ఫ్యాక్టర్‌ ఒకటి కంటే తక్కువ ఉంటే కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని ఒకటికంటే ఎక్కువ నమోదైతే వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉందని అర్థం. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్‌ ఫ్యాక్టర్‌ పెరుగుతుండటంతో చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సూచిస్తోంది.

దేశంలో సెకెండ్‌ వేవ్‌ ఇంకా ముగియలేదని అధికారులు పేర్కొంటు న్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 4.7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. భారత్‌లో సైతం 44 జిల్లాల్లో వారాంతపు పాజిటివిటీ రేటు 10కి పైగా నమోదవుతోందని కేంద్రం తెలిపింది. మరోవైపు గత నాలుగు వారాలుగా కేరళ, మహారాష్ట్ర, మణిపూర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లలోని 18 జిల్లాల్లో కరోనా కేసులు ఆరోహణ క్రమంలో పెరుగుతూ రావడం కూడా ఆందోళనకరమని చెప్పింది. గత వారంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 50శాతం కేసులు కేరళలోనే నమోదయ్యాయి.  

42,625 మందికి కరోనా పాజిటివ్‌
దేశవ్యాప్తంగా బుధవారం నాటి గణాంకాల ప్రకారం మరో 42,625  మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,17,69,132కు చేరుకుందని కేంద్రం తెలిపింది. 24 గంటల వ్యవధిలో ఈ మహమ్మారి బారిన పడిన మరో 562మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 4,25,757కు  పెరిగాయి
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top