
కోవిడ్ టెస్టుల్ని పెంచండి వైద్య సిబ్బందికి ఆరోగ్యశాఖ ఆదేశం
కొత్తగా 2 పాజిటివ్‌లు 40 చేరిన కోవిడ్ బాధితులు
బనశంకరి: కోవిడ్–19 వల్ల బెంగళూరులో ఓ వృద్ధుడు చనిపోగా, మరో రెండు పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కోవిడ్ టెస్టులను పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించింది. సాంకేతిక సలహా సమితి సూచనల ప్రకారం రోజుకు 150 నుంచి 200 పరీక్షలు చేపట్టాలని తీర్మానించారు. శ్వాసకోస జబ్బుల రోగులకు ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేయాలని ఆదేశించింది. టెస్టుల కిట్‌లను సత్వరమే వాడుకోవాలని తెలిపింది.
పరీక్షలు ప్రారంభం
వృద్ధులు, పిల్లల్లో గర్భిణీ స్త్రీలలో రోగ లక్షణాలు కనబడితే కోవిడ్ పరీక్షలను చేయాలని, శాంపిల్స్ ను ల్యాబోరేటరీలకు అదే రోజు పంపించాలని ఆరోగ్యశాఖ జిల్లాల వైద్యాధికారులకు సూచించింది. ఆదివారం నుంచి రాష్ట్రంలోని 8 మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు ప్రారంభించారు. బెంగళూరులో మల్లేశ్వరంలో 45 ఏళ్ల వ్యక్తి కి, రాజాజీనగరలో 38 ఏళ్ల వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వారు ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 40కి చేరుకున్నాయి. నగరంలో ఓ వృద్ధుడు మరణించినట్లు తెలిసింది.
ప్రమాదకర వేరియంట్ కాదు
= ఆరోగ్యమంత్రి దినేశ్
శివాజీనగర: ఇప్పుడు బయటపడిన కోవిడ్ వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటోందని ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ఇప్పుడు కోవిడ్ జే–1 ఉపజాతి బయటపడింది, ఇది అధిక దుష్ప్రభావం చూపినట్లు లేదు. ఎవరికీ తీవ్ర రోగ లక్షణాలు కనిపించలేదు. మూడు నాలుగు రోజుల్లో పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకొంటామని తెలిపారు. మొదటి, రెండవ వేవ్‌ల పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. టెస్టింగ్ కిట్‌లు రెండు రోజుల్లోగా వస్తాయన్నారు.
శ్వాసకోశ రోగులు, వృద్ధులు, గర్భవతులకు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పకుండా టెస్టు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కరోనా వల్ల బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడని, ఆయనకు ముందునుంచి అనారోగ్యం ఉందని చెప్పారు. బెంగళూరులో నిమ్హాన్స్ ఆసుపత్రి, బెంగళూరు మెడికల్ కాలేజీ, ఎన్‌ఐవీ కేంద్రంతో పాటుగా రాష్ట్రంలో 10 చోట్ల కరోనా టెస్టులు నిర్వహిస్తారన్నారు. ఒక నెలకు సరిపోయేలా 5 వేల ఆర్‌టీ పీసీఆర్ టెస్టింగ్ కిట్‌లను కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.