గహ్లోత్‌ ప్రభుత్వానికి చిక్కులు తప్పవా?!

Congress Party Worry Again Started in Rajasthan  - Sakshi

జైపూర్‌‌: భారతీయ ట్రైబల్‌ పార్టీ(బీటీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజస్తాన్‌లోని గహ్లోత్‌‌ ప్రభుత్వానికి తమ మద్దుతు ఉపసంహరించుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీటీపీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి రాజస్తాన్‌ కాంగ్రెస్‌ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది ఆరంభంలో డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ తన అనుచర వర్గంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో అశోక్‌ గహ్లోత్ ప్రభుత్వానికి మద్దుతు తెలుపడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు 10​కోట్లు తీసుకున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మహేంద్రజిత్‌ సింగ్‌ ఆరోపించారు. బీటీపీ ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకున్నారని మహేంద్రజిత్‌ సింగ్‌ ఆరోపిస్తున్న వీడియోని బీజేపీ చీఫ్‌ సతీష్‌ పూనియ నవంబర్‌ చివర్లో ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు కాంగ్రెస్‌ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి.

బీజేపీతో కుమ్మక్కైన కాంగ్రెస్‌!
కాగా పంచాయితీ ఎన్నికల సందర్భంగా, తమ పార్టీ మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థిని ఓడించడానికి కాంగ్రెస్‌ బీజేపీతో చేతులు కలిపిందని బీటీపీ ఆరోపించింది. 27 స్థానాలు గల దుర్గాపుర్‌ జిల్లాలో కేవలం 8 స్థానాలు గల బీజేపీ, జిల్లా ప్రముఖ్‌ స్థానాన్ని ఎలా గెలుచుకుంటుందని, ఇది కాంగ్రెస్‌ , బీజేపీ చీకటి ఒప్పందంని విమర్శించింది.  ఇది నమ్మక ద్రోహమని భవిష్యతులో కాంగ్రెస్‌తో అసలు జత కట్టమని బీటీపీ తెలిపింది. 

కాంగ్రెస్‌ కంటే బీజేపీకే ఎక్కువ
రాజస్తాన్‌లోని 222 పంచాయతి సమితిలోని 4371 సీట్లలో ఎన్నికలు జరగగా అధికార కాంగ్రెస్‌ పార్టీ 1852 గెలుచుకోగా, బీజేపీ 1989 సీట్లలో గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 439 సీట్లలో గెలుపొందారు. ఎన్‌డీఏ లో మిత్రపకక్షాం ఆర్‌ఏల్‌పీ 60 సీట్లు గెలుచుకుంది. సీపీఐ-ఎం 26 స్థానాలలో విజయాని కైవసం చేసుకుంది. 21 జిల్లా పరిషత్‌లో జరిగిన ఎన్నికల్లో 14 స్థానాలలో బీజేపీ తన అధ్యికతను ప్రదర్శించింది.  బీజేపీ 353, కాంగ్రెస్‌ 252, ఆర్‌ఎల్‌పీ 10, సీపీఐ-ఎం 2, స్వతంత్రులు 18 స్థానాలలో గెలిచారు. గత నెలలో జరిగిన ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 4 స్థానాలు కైవసం చేసుకుంది. అనుహ్యంగా పంచాయితీ ఎన్నికల్లో ప్రజలలో వ్యతిరేకత పెరిగింది. దీంతో పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూసింది.

మరోసారి రాజకీయ అలజడి!
పంచాయితీ ఫలితాలతో రాజస్తాన్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ దిశగా కాంగ్రెస్‌ ఆలోచిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో 19 మంది ఎమ్మెల్యేలు సచిన్‌ పైలట్‌తో బయటకు వచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మాణం అనివార్యమైంది. 200 మంది సభ్యులు గల అసెంబ్లీలో 105 సొంత బలంతో పాటు ..16 మంది ఇతర ఎమ్మెల్యేలు మద్దతు పలకడంతో గహ్లోత్‌‌ విశ్వాస తీర్మాణంలో నెగ్గారు. ఇందులో 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆరుగురు బీఎస్పీ సభ్యులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరు కాక 13 మంది స్వతంత్రులు , ఒక ఆర్‌ ఎల్‌ డీ సభ్యుడు గహ్లోత్‌‌ ప్రభుత్వానికి తమ మద్దతు పలికారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు పలికిన 121 మంది సభ్యులలో 21 మంది మంత్రులుగా ఉన్నారు.  గరిష్టంగా 30 మంది మంత్రులుగా ఉండవచ్చు. దీంతో మిగిలిన 100 మంది సభ్యులలో 9 మందికి మాత్రమే మంత్రి అయ్యే అవకాశం ఉంది. 

గహ్లోత్ 9 మంది సభ్యులకు మంత్రి పదవులు, 10 మందికి పార్లమెంట్‌ కార్యదర్శులుగా, 40 మందిని వివిధ బోర్డులకు కమిషనర్లుగా, 20 మందిని శాసనసభ కమిటీ అధ్యక్షులుగా,  12 మందికి పైగా సభ్యులను స్థానిక సంస్థల అధిపతులుగా నియమిస్తే బాగుంటుందని పార్టీ పెద్దలతో చేర్చించున్నట్టు, సొంత పార్టీ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. సంవత్సరం ఆరంభంలో రాజస్తాన్‌లో ఏర్పడిన రాజకీయ అస్థిరతను పరిష్కరించడానికి సోనియా గాందీ ప్యానెల్‌ ఏర్పరరిచిన విషయం తెలిసిందే ఇందులో అహ్మద్‌ పటేల్‌ సభ్యుడు. పటేల్‌ తన రాజకీయ అనుభవంతో సచిన్‌ పైలట్‌ని అసంతృప్తి జ్వాలలను చల్లార్చారు. కానీ ఇప్పుడు ఆయన లేరు. ఇటువంటి పరిస్థితులలో బీటీపీ నుంచి ఇద్దరు శాసనసభ్యులు బయటకు రావడం, అలాగే పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చవిచూడటం వంటి పరిణామాలు అన్ని బీజేపీకి కలిసొచ్చే అంశాలు. బీటీపీ శాసనసభ్యులను భారతీయ జనతా పార్టీలో ఆకర్షించే ప్రయత్నాలు మొదలవుతాయి. ఇవన్నీ కాంగ్రెస్‌కి ప్రతికూలంగా పరిణమించనున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top