ప్రధాని మోదీకి అభిజిత్ దీప్కే సూచన
న్యూఢిల్లీ: కోవిడ్ సమయంలో ఏర్పాటైన పీఎంకేర్స్ ఫండ్‌లో మూలుగుతున్న డబ్బులను దేశంలో గ్రామీణ పాఠశాలల మౌలిక వసతుల బాగుకు ఉపయోగించాలని కాక్రోచ్ జనతాపార్టీ కన్వీనర్ అభిజిత్ దీప్కే సూచించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వెయ్యి హైటెక్ పాఠశాలల నిర్మాణానికీ ఈ నిధులు వాడవచ్చునని ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. సీజేపీ ఆధ్వర్యంలో ఇప్పటికే ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో గ్రామీణ పాఠశాలల బాగు డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు బడికెళ్లేందుకు మంచి రోడ్లు, తరగతి గదుల్లో బెంచిలు, తాగునీరు కోసం ఎదురు చూస్తున్నారని దీప్కే ఆ వీడియోలో చెప్పారు. ‘‘ఒక పక్క పీఎంకేర్స్ ఫండ్‌లో రూ.8500 కోట్లు నిరుపయోగంగా పడిఉన్నాయి. ఇంకోపక్క ఈ దేశపు బాలలు పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బులను వారి కోసం ఎందుకు ఖర్చు చేయకూడదు?’’ అని ప్రశ్నించారు. అన్ని రకాల సౌకర్యాలు, హంగులతో ఒక పాఠశాల కట్టేందుకు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు అవుతుందని అనుకుంటే పీఎంకేర్స్‌లో ఏడాదికాలంగా పడి ఉన్న డబ్బుతో వెయ్యికిపైగా హైటెక్ స్కూళ్లు కట్టవచ్చునని, కానీ అలాంటిదేమీ జరగడం లేదని అన్నారు. దేశ ప్రజలు కూడా ఈ డబ్బులను పాఠశాలల బాగుకు వాడేలా ప్రధానికి తెలియజేయాలని దీప్కే విన్నవించారు. ప్రధాని కూడా తాను ప్రజలను పట్టించుకుంటున్నట్లు కనిపించాలని విమర్శించారు.


