
న్యూఢిల్లీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్)పూర్తిగా మహిళా కమాండోలతో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రత్యేకంగా తర్ఫీదు పొందే ఈ బృందాల సేవలను ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో వినియోగించుకుంటామని సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో విధుల్లో ఉన్న 100 మంది మహిళా బలగాలను శిక్షణ కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు.
వీరికి మధ్యప్రదేశ్‌లో ఉన్న బర్వాహా ట్రెయినింగ్ సెంటర్‌లో కమాండ్ నైపుణ్యాలపై 8 వారాల శిక్షణ త్వరలోనే మొదలవుతుందన్నారు. దేశంలోని 68 పౌర విమానాశ్రయాలతోపాటు ఢిల్లీ మెట్రో, ఇతర కీలకమైన ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు 1.70 లక్షల మంది సీఐఎస్‌ఎఫ్ బలగాలు భద్రత కల్పిస్తున్నాయి. ఇందులో 12,491 మంది మహిళలున్నారు.2026లో సీఐఎస్‌ఎఫ్‌లోకి మరో 2,400 మందిని చేర్చుకుంటారు. ఈ విభాగంలో మహిళల ప్రాతినిథ్యాన్ని విడతల వారీగా కనీసం 10 శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.