breaking news
Anti-terrorism Activities
-
కశ్మీర్ వేర్పాటువాద గ్రూపులపై నిషేధం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పీపుల్స్ ఫ్రీడం లీగ్(జేకేపీఎఫ్‌ఎల్)తోపాటు వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్‌తో సంబంధమున్న జమ్మూకశ్మీర్ పీపుల్స్ లీగ్(జేకేపీఎల్)లోని అన్ని గ్రూపులపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఉపా) కింద కేంద్ర ప్రభుత్వం శనివారం నిషేధం విధించింది. దీంతోపాటు, ఉగ్రవాద ఆరోపణలపై జైలులో ఉన్న యాసిన్ మాలిక్ సారథ్యంలోని జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్)పై నిషేధాన్ని మరో అయిదేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడటానికి కొద్ది గంటల ముందు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఉగ్ర సంస్థలపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. -
ఉగ్రమూకకు దాసోహమైన పాకిస్తాన్
రహదారుల్ని దిగ్బంధించడం, రాజధానిని ముట్టడించడం ఘర్షణలకు దిగడం, పోలీసుల్ని కిడ్నాప్ చేయడం హింసా మార్గంలోనే డిమాండ్లను సాధించడం మొదట్నుంచి ఇదే వారి పని. మత మౌఢ్యంతో రెచ్చిపోయే ఆ సంస్థను కట్టడి చేయకుండా, వారు చెప్పినట్టుగా తలూపుతున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ టీఎల్పీపై నిషేధం ఎత్తివేయడంతో ఏం జరగబోతోంది? పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఉగ్రవాద మూకలకు దాసోహమన్నారు. ఇస్లాం ఉగ్రవాద సంస్థ తెహ్రీక్–ఇ–లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ)పై నిషే«ధాన్ని ఎత్తేశారు. పాకిస్తాన్లో అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసే నాలుగో షెడ్యూల్ నుంచి టీఎల్పీని తొలగిస్తూ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పాకిస్తాన్ కేబినెట్ ఉగ్రవాద నిరోధక చట్టం, 1997 ద్వారా టీఎల్పీపై విధించిన నిషేధాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసుల మేరకు ఎత్తివేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. గతకొద్ది రోజులుగా టీఎల్పీ చేస్తున్న ఆందోళనలకు ఇమ్రాన్ ప్రభుత్వం తలవంచింది. ఉగ్రవాదుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇమ్రాన్ వా రికి మోకరిల్లడంతో పరిణామాలు ఎలా ఉంటాయోనన్న భయాందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో లాహోర్‌లో రోడ్లను దిగ్బంధించిన టీఎల్పీ కార్యకర్తలు(ఫైల్) (ఇన్సెట్ రిజ్వీ) ఎందుకీ ఆందోళనలు గతకొద్ది నెలలుగా పాకిస్తాన్లో టీఎల్పీ హింసను రాజేస్తోంది. ప్రధాన నగరాలను ముట్టడిస్తూ ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని హడలెత్తిస్తోంది. మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా ఫ్రాన్స్‌కు చెందిన పత్రిక చార్లీ హెబ్డో ఆయన కేరికేచర్లు ప్రచురించడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. 2015 ఇస్లాం అతివాదులు చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడి చేసి 12 మందిని కాల్చిచంపారు. నిందితులకు శిక్ష ఖరారయ్యే దశలో గత ఏడాది ఆ మ్యాగజైన్ పాత కేరికేచర్లను తిరిగి ప్రచురిస్తామని ప్రకటించింది. దీంతో పాక్‌లో నిరసనలు భగ్గుమన్నాయి. టీఎల్పీ చీటికి మాటికి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ఉండడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం టీఎల్పీపై ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసి పార్టీ చీఫ్ సాద్ రిజ్విని అరెస్ట్ చేసింది. వీరి డిమాండ్లను పాక్ ప్రభుత్వం తిరస్కరించడంతో రోడ్డెక్కిన టీఎల్పీ కార్యకర్తలు అక్టోబరు చివరి వారంలో ప్రధాన నగరాలను దిగ్బంధించారు. ఇస్లామాబాద్, రావల్పిండిలకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు లేకుండా హైవేలను దిగ్బంధించారు. హింసను నిరోధించడానికి పాక్ ప్రభుత్వం వాళ్ల డిమాండ్లు అన్నింటికి అంగీకరించకుండా మధ్యేమార్గంగా అరెస్టయిన టీఎల్పీ సభ్యులు 2 వేల మందిని ఇటీవల జైళ్ల నుంచి విడుదల చేసింది. అయినా ఆ సంస్థ పట్టు వీడలేదు. పాక్‌లో ఫ్రాన్స్ రాయబారిని బహిష్కరించాలని, టీఎల్పీ చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్విని విడుదల చేయాలని, తమపై ఉగ్రవాద సంస్థ ముద్రను తొలగించాలని , రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ గుర్తింపునివ్వాలన్న డిమాండ్లతో హింసకు దిగింది. గత వారంలో లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కి లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌కు వేలసంఖ్యలో మద్దతుదారులు పోటెత్తడంతో ప్రభుత్వం రాజీ కొచ్చింది. మతపెద్దలను రంగంలోకి దింపి.. సంప్రదింపుల ద్వారా రాజీ కుదుర్చుకుంది. దాంతో టీఎల్పీ రాజధాని ముట్టడిని విరమించుకుంది. ఇటీవల టీఎల్పీ సృష్టించిన విధ్వంసంలో 21 మంది మరణించగా, అందులో 10 మంది పోలీసులే. పరిణామాలు ఎటు దారి తీస్తాయి ? టీఎల్పీకి పూర్తి స్థాయిలో ఇమ్రాన్ ప్రభుత్వం మోకరిల్లడంపై పాక్ మేధోవర్గంలోనూ, అంతర్జాతీయంగా ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ సంస్థ ఏర్పాటయ్యాక హింసామార్గంలోనే ప్రభుత్వాన్ని కనీసం ఏడుసార్లు దారిలోకి తెచ్చుకుంది. అయిదేళ్లలో ఏడుసార్లు అతి పెద్ద నిరసన కార్యక్రమాలకు దిగింది. మరోసారి టీఎల్పీ ప్రధాన డిమాండ్లన్నింటికీ ప్రభుత్వం అంగీకరించడంతో ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ప్రధాని ఇమ్రాన్‌పై విరుచుకుపడింది. టీఎల్పీ చెప్పుచేతల్లోకి ప్రభుత్వం వెళ్లిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా కూడా ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తోంది. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోవడం, ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోవడం, ఐఎస్ఐ కొత్త చీఫ్ నియామకం వంటి చర్యలతో ఇప్పటికే ఇమ్రాన్ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. టీఎల్పీపై నిషేధాన్ని ఎత్తివేస్తే ఆ సంస్థ సానుభూతిపరుల మద్దతు లభిస్తుందన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యమేలుతూ ఉండడం పాక్ కూడా అదే మార్గంలో ఉగ్రవాదులకు బహిరంగంగానే మద్దతు పలుకుతూ ఉండడంతో పరిస్థితులు ఎటువైపు తిరుగుతాయోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఏమిటీ టీఎల్పీ ? తెహ్రీక్–ఇ–లబ్బాయిక్ అంటే మహమ్మద్ ప్రవక్త అనుచరుల ఉద్యమం (బరేల్వి) అని అర్థం. ఇస్లాంను దూషించేవారిని కఠినంగా శిక్షించడం, దీనికి సంబంధించిన చట్టాలను పకడ్బందీగా అమలయ్యేలా చూడడానికే ఈ సంస్థ పుట్టుకొచ్చింది. పాకిస్తాన్లో సగం మంది ప్రజల్లో బరేల్వి ఉద్యమం పట్ల మద్దతు ఉంది. సూఫీ సంప్రదాయాలతో కూడిన ఇస్లాంను వ్యాప్తి చేయడమే వీరి ఉద్దేశం. పాకిస్తాన్‌లోని దైవదూషణకి సంబంధించిన చట్టాలను సంస్కరించాలని ప్రయత్నించిన పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్‌ని పోలీసు గార్డ్ ముంతాజ్ ఖాద్రి 2011లో దారుణంగా హతమార్చాడు. ఖాద్రిని జైలు నుంచి విడుదల చెయ్యాలన్న డిమాండ్‌తో 2015లో లాహోర్ మసీదులోని మతబోధకుడు ఖాదిమ్ హుస్సేన్ రిజ్వి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఖాద్రికి ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయడంతో అతని అంతిమ యాత్రలో తెహ్రీక్–ఇ–లబ్బాయిక్ పాకిస్తాన్ పేరుతో రాజకీయ పార్టీగా అవతరించింది. వేలాది మంది ఇస్లాం అతివాదులు ఈ పార్టీలో చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన టీఎల్పీ సింధ్ ప్రావిన్స్‌లో రెండు స్థానాలను గెలుచుకుంది. గత ఏడాది నవంబర్‌లో ఖాదిమ్ అనారోగ్యంతో మరణించగా అతని కుమారుడు సాద్ రిజ్వి టీఎల్పీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
కశ్మీర్లో మళ్లీ ‘ఆపరేషన్లు’
న్యూఢిల్లీ/శ్రీనగర్: రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వాటిని పునరుద్ధరించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అన్ని అత్యవసర చర్యలు తీసుకోవాలని, ఉగ్ర దాడులు, హత్యాకాండ వంటి వాటిని నిలువరించాలని భద్రతా దళాలను ఆదేశించామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, హింస లేని వాతావరణం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. శాంతి కోరుకునే వారంతా ఏకతాటిపైకి రావాలని, తప్పు దారిలో వెళుతున్న వారిని శాంతి మార్గంలోకి తీసుకురావాలని కోరారు.∙రంజాన్ మాసం సందర్భంగా మే 17 నుంచి కశ్మీర్లో సైనిక ఆపరేషన్లను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. రంజాన్ మాసం ప్రశాంతంగా సాగేందుకు ఆపరేషన్లను నిలుపుదల చేసి సహకరించిన భద్రతా బలగాలను రాజ్‌నాథ్ అభినందించారు. అధికారిక సమాచారం ప్రకారం ఏప్రిల్ 17 నుంచి మే 17 మధ్య 18 ఉగ్ర దాడుల సంఘటనలు నమోదైతే.. ఆపరేషన్ల నిలుపుదల తర్వాత ఆ సంఖ్య 50కిపైగా పెరిగింది. నిరాశ కలిగించింది: రాజకీయ పార్టీలు ‘కేంద్రం ప్రకటన అసంతృప్తి కలిగించింది. ఇది అనూహ్య పరిణామం’ అని ప్రధాన ప్రతిపక్షం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధికార ప్రతినిధి జునైద్ మట్టు అన్నారు. భద్రతా దళాల కార్యకలాపాల విరమణను సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. కేంద్రం నిర్ణయం నిరాశ కలిగించిందనీ, ప్రస్తుత పరిస్థితుల్లో విరమణ పొడిగింపు సాధ్యం కాదని అధికార పీడీపీ ప్రధాన కార్యదర్శి పీర్జాదా మన్సూర్ అన్నారు. ‘శాంతి ప్రక్రియ టూ వే ట్రాఫిక్ లాంటిది. మా తరఫున చేయాల్సిందంతా చేశాం. విశ్వాసం కలిగించే చర్యలన్నిటినీ తీసుకున్నాం. కానీ బుఖారీకి ఏం జరిగింది? ఆయన్ను నిర్దాక్షిణ్యంగా చంపేశారు’ అని పీర్జాదా అన్నారు. కశ్మీర్ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టమైన విధానం లేదని జమ్మూ కశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీఏ మిర్ విమర్శించారు. -
వీవీఐపీ భద్రత నుంచి కమాండోల ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక చర్యల్లో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) కమెండోలు మరింతగా పాలుపంచుకునే దిశగా.. 600 మంది కమాండోలను వీవీఐపీల భద్రత యూనిట్ నుంచి ఎన్ఎస్జీ తప్పించింది. ప్రముఖులకు భద్రత నిర్వహిస్తున్న ఎన్ఎస్జీ కమాండోల్ని వెనక్కు రప్పించాలని రెండేళ్లుగా ప్రణాళిక రూపొందిస్తున్నా అది కార్యరూపం దాల్చలేదు. అయితే పఠాన్‌కోట్ ఘటన నేపథ్యంలో ఎన్ఎస్జీ సిబ్బందిని ఇకమీదట కచ్చితంగా ఉగ్రవాద చర్యల్ని ఎదుర్కొనేందుకే వినియోగించాలన్న భావనకు వచ్చారు. తాజాగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం 11వ ప్రత్యేక రేంజర్స్ గ్రూప్(ఎస్ఆర్జీ)లోని మూడు బృందాల్లో రెండింటిని వీవీఐపీ భద్రత కార్యకలాపాల నుంచి ఉపసంహరించాలని భావిస్తున్నారు. వీరిని స్పెషల్ యాక్షన్ గ్రూప్(ఎస్ఏజీ)తో కలసి ఉగ్రవాద మూకలపై పోరాడేందుకు సిద్ధం చేయాలనుకుంటున్నారు. ఎన్ఎస్జీ కమాండో బృందాలు ప్రస్తుతం ఐదు ప్రాథమిక యూనిట్లుగా ఉంది.