ప్రమాదాలు జరగకుండా శునకాల మెడలో రిప్లెక్టర్లు

Charitable Trust Protect Dogs Over Night Reflective Belt In Maharashtra - Sakshi

మాణుస్కి సేవా సంస్థ కసరత్తు 

వర్సోవా: రాత్రి వేళల్లో శునకాలకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాటి మెడలో ‘నైట్‌ రిప్లెక్టర్‌ బెల్ట్‌’ వేయాలని బోరివలికి చెందిన మాణుస్కి (మానవత్వం) అనే సేవా సంస్థ నిర్ణయం తీసుకుంది. శునకాల మెడలో రిప్లెక్టర్‌ బెల్ట్‌ వేయడంవల్ల వాటికి జరిగే ప్రాణహానితోపాటు వాహనాలకు జరిగే ప్రమాదాలు కూడా అదుపులోకి వస్తాయని సంస్థ భావిస్తోంది. పెంపుడు కుక్కలు ఇళ్లకే పరిమితమైనప్పటికీ ఊర కుక్కలు మాత్రం నగర రోడ్లపై తిరుగుతుంటాయి. రాత్రి వేళ్లలో అవి అరుస్తూ అటూ, ఇటూ పచార్లు కొట్టడం, పరుగులు తీయడం లాంటివి చేస్తాయి. రాత్రి సమయంలో అకస్మాత్తుగా కుక్కలు వాహనాల ముందుకు రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధ్యమైనంత వరకు డ్రైవర్లు వాటిని తప్పించే ప్రయత్నం చేస్తారు.

కానీ, కొన్ని సందర్భాలలో వాటిని ఢీ కొట్టి పోతుంటారు. అంతేగాకుండా కుక్కలను తప్పించే ప్రయత్నంలో వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇలా జరిగిన ప్రమాదల వల్ల కొన్ని శునకాలు మృతి చెందగా మరికొన్ని తీవ్రంగా గాయపడుతున్నాయి. రాత్రులందు కొన్ని కుక్కలు రోడ్డుపై లేదా రోడ్డు పక్కన, సందుల్లో నిద్రపోతుంటాయి. చీకట్లో సరిగా కానరాక డ్రైవర్‌ వాటి మీదుగా పోనిస్తారు.

పార్కింగ్‌ చేసే క్రమంలో కూడా నిద్రపోతున్న కుక్కల పైకి వాహనాలు ఎక్కించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు బోరివలికి చెందిన మాణుస్కి (మానవత్వం) అనే సేవా సంస్థ కుక్కల మెడలో నైట్‌ రిప్లెక్టర్‌ బెల్ట్‌ వేయాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయంలో వాహనాల హెడ్‌లైట్‌ వెలుగుకు కుక్కల మెడలో ఉన్న రిప్లెక్టర్‌ మెరుస్తుంది. దీంతో వాహనాల డ్రైవర్లు దూరం నుంచి పసిగట్టి అప్రమత్తమవుతారు. ఫలితంగా ప్రమాదాలు అదుపులోకి వస్తాయని సంస్థ తెలిపింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top