అఫ్గాన్ మంత్రి ప్రెస్ మీట్‌ వివాదం.. కేంద్రం వివరణ | Afghanistan FM Excludes Women Journalists in Delhi Press Meet Sparks Outrage | Sakshi
Sakshi News home page

అఫ్గాన్ మంత్రి ప్రెస్ మీట్‌ వివాదం.. కేంద్రం వివరణ

Oct 11 2025 11:44 AM | Updated on Oct 11 2025 3:56 PM

Centre Amid Row Over No Women Journalists At Taliban Press Meet

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ  ఏర్పాటుచేసి మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై వివాదం తలెత్తింది. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పందిస్తూ, అఫ్గాన్ మంత్రి మీడియా సమావేశంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ సమావేశానికి మహిళా జర్నలిస్టులను ముత్తఖీ ఆహ్వానించలేదంటూ పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో విపక్షాలు మహిళా జర్నలిస్టులకు మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలోనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై స్పందిస్తూ వివరణ ఇచ్చింది.

శుక్రవారం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో అఫ్గాన్ మంత్రి ముత్తఖీ ద్వైపాక్షిక చర్చలు జరిపిన తర్వాత  ఆయన అఫ్గాన్ రాయబార కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే దీనిలో పాల్గొనేందుకు వచ్చిన మహిళా జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సమావేశానికి ఎంపిక చేసిన కొందరు పురుష జర్నలిస్టులు, అఫ్గాన్ రాయబార కార్యాలయ అధికారులు మాత్రమే హాజరయ్యారు.  సమావేశంలో ముత్తఖీ భారతదేశం- అఫ్గాన్ సంబంధాలు, పరస్పర మానవతా సహాయం, వాణిజ్య విధానాలు, భద్రతా సహకారం తదితర ప్రాంతీయ అంశాలపై మాట్లాడారు.
 

మహిళా జర్నలిస్టులను అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ  ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి అహ్వానించకపోవడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించారు. దీనిని భారతీయ మహిళా జర్నలిస్టులకు జరిగిన అవమానంగా పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ తమ వైఖరిని స్పష్టం చేయాలని  ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. ఇదేవిధంగా మాజీ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఈ సంఘటనపై స్పందిస్తూ.. తోటి మహిళా జర్నలిస్టులకు మద్దతుగా పురుష జర్నలిస్టులు ప్రెస్ మీట్‌ను బహిష్కరించి ఉంటే బాగుండేదని  అన్నారు.
 

తాలిబన్ విదేశాంగశాఖ మంత్రి ముత్తాఖీ ప్రెస్‌మీట్‌ పై వివాదం

ఈ ఘటన హాస్యాస్పదంగా ఉన్నదని చిదంబరం పేర్కొన్నారు. తాలిబన్ల వివక్షపూరిత విధానాలకు భారత ప్రభుత్వం అనుమతించిట్లు ఉన్నదన్నారు. ఇందుకు సహకరించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. కాగా అఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం మహిళలపై  పలు ఆంక్షలు విధించింది. ఇటీవల అఫ్ఘనిస్తాన్ విశ్వవిద్యాలయానికి చెందిన మహిళలు రాసిన పుస్తకాలను కూడా నిషేధించింది. మహిళా సామాజిక శాస్త్రం, మానవ హక్కులు, అఫ్ఘన్ రాజ్యాంగ చట్టం-ప్రపంచీకరణ-  అభివృద్ధి తదితర 18 కోర్సులను కూడా రద్దు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement