ఏం చేశారు.. ఇద్దరు కార్పొరేటర్లు

CCB Police Focus on Congress Corporaters in Karnataka Violence - Sakshi

అల్లర్ల కేసులో ప్రశ్నించిన పోలీసులు  

సంపత్‌రాజ్, అబ్దుల్‌జాకీర్‌పై కన్ను

బనశంకరి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దేవరజీవనహళ్లి, కమ్మగొండనహళ్లి హింసాకాండల కేసులో ఇద్దరు కాంగ్రెస్‌ కార్పొరేటర్లపై సీసీబీ పోలీసులు దృష్టి సారించారు. డీజే హళ్లి కార్పొరేటర్, మాజీ మేయర్‌ సంపత్‌రాజ్, పులకేశినగర వార్డు కార్పొరేటర్‌ అబ్దుల్‌ రాఖిద్‌ జాకీర్‌ను సీసీబీ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు మంగళవారం సీసీబీ డీసీపీ కేసీ.రవికుమార్‌ తెలిపారు. సీసీబీ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌పాటిల్‌ నేతృత్వంలో చామరాజపేటే సీసీబీ కార్యాలయంలో వీరి విచారణ సాగింది.  (బెంగళూరు అల్లర్లు: ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు)

మరో 30 మంది అరెస్టు : అల్లర్ల కేసులో రోజురోజుకు అరెస్టులు పెరుగుతున్నాయి. సోమవారం రాత్రి మళ్లీ 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వివిధ విభాగాల పోలీసులు డీజేహళ్లి, కేజీ హళ్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో గల్లీ గల్లీలో ఉన్న ఇళ్లపై దాడిచేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారి సంఖ్య 380కి పెరిగింది. గొడవ చోటుచేసుకున్న రోజు ఫోటోలు, సీసీ కెమెరా దృశ్యాలు, నిందితులు చెబుతున్న సమాచారం ప్రకారం ప్రతిరోజూ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పోలీసులు వెళ్లగానే కొందరు దాక్కోగా ఇల్లిల్లూ గాలించి నిర్బంధించారు. గలాటాల తరువాత వివిధ ప్రాంతాలకు పారిపోయినవారిని పట్టుకునేందుకు పోలీసులు కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాలకు వెళ్లారు.

అనుమానిత ఉగ్రవాది విచారణ 
ఆల్‌హింద్‌ ఉగ్ర సంస్ధ సభ్యుడు, అనుమానిత ఉగ్రవాది సమీయుద్దీన్‌ను ఏటీసీ విభాగం అధికారులు రహస్య ప్రాంతంలోకి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. కేజీ.హళ్లి, డీజే.హళ్లి అల్లర్లకు సంబంధించి డీజే.హళ్లి నివాసి సమీయుద్దీన్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టగా ఉగ్రసంస్ధ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇతను డీజే.హళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న అల్లర్లలో భాగస్వాములైనట్లు అనుమానం వ్యక్తమైంది. ఘటన సమయంలో నిప్పుపెట్టడానికి చేతులతో సైగ చేసే దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. ఇతడి వాట్సాప్‌ మెసేజ్‌ చేయడం, వందలాది ఫోన్లు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. 

ఆ రోజు ఎక్కడ ఉన్నారు   
గలాటాలు జరిగిన రోజు మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు మొదలైన సాధారణ ప్రశ్నల నుంచి లోతుగా ఆరా తీస్తున్నారు. అల్లరిమూకలతో కార్పొరేటర్లకు సంబంధాలు ఉన్నాయా అని విచారణ సాగుతోంది. వారి మొబైల్‌ఫోన్ల కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. ప్రమేయం లేదని తేలితే వదిలిపెట్టే అవకాశముంది, లేదంటే అరెస్టు చేయవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. సంపత్‌రాజ్‌ వ్యక్తిగత సహాయకున్ని కూడా ఖాకీలు ప్రశ్నిస్తున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top