బనశంకరి: బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ 6 వ సెక్టార్‌లోని ఐపీఎస్ లేఔట్ సర్వీస్ విల్లాలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు అడ్డుకుని నలుగురిని అరెస్ట్‌చేశారు. ఆ విల్లాను రోజుకు రూ.20 వేలకు అద్దెకు తీసుకున్న నిర్వాహకులు అమిగోస్ అనే యాప్ ద్వారా రేవ్ పార్టీకి యువతీ యువకులను ఆహ్వానించువారు. యువకుల నుంచి రూ.1,099, అమ్మాయిల నుంచి రూ.499 ఫీజు వసూలు చేసేవారు. రాత్రంతా మద్యం, మ్యూజిక్‌తో మజా చేసేవారు.
హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో ఎక్కువమంది ఐపీఎస్‌ల నివాసాలు ఉన్నాయి. ఇక్కడైతే పోలీసులు రైడ్ చేయరని నిర్వాహకులు భావించారు. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి హుక్కాలు, ఈ–సిగరెట్లు, భారీగా మద్యం సీజ్ చేశారు. పార్టీలో 12 మంది యువతులు, 17 మంది యువకులు ఉన్నారు. నిర్వాహకులు దీక్షత్, వేదాంత్ పండిత్, వరుణ్, శంకర్‌ను అరెస్ట్ చేశారు. విల్లా యజమానిపై కేసు నమోదైంది.


