ఆర్థిక నేరగాళ్లను అప్పగించాలి | Sakshi
Sakshi News home page

ఆర్థిక నేరగాళ్లను అప్పగించాలి

Published Sat, Apr 23 2022 4:25 AM

Bringing back economic fugitives high priority - Sakshi

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరస్థులను రప్పించి చట్టం ముందు నిలబెట్టడం తమకు అత్యంత ప్రాధాన్యాంశమని ఇంగ్లండ్‌కు భారత్‌ స్పష్టం చేసింది. దీన్ని తాను అర్థం చేసుకున్నానని భారత పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. భారత చట్టాలను తప్పించుకునేందుకు తమ న్యాయవ్యవస్థను వాడుకోవాలనుకునే నేరగాళ్లను ఎన్నటికీ స్వాగతించబోమని స్పష్టం చేశారు.

ఆర్థిక నేరాలకు పాల్పడి ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీలను అప్పగించాలని చాలారోజులుగా భారత్‌ ఒత్తిడి తెస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీతో చర్చల అనంతరం ఉమ్మడి మీడియా సమావేశంలో జాన్సన్‌ మాట్లాడారు. ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. న్యాయపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని వివరించారు. మోదీ, జాన్సన్‌ చర్చల్లో ఆర్థిక నేరగాళ్ల అప్పగింత అంశం ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా చెప్పారు. ఈ విషయంలో భారత్‌ వైఖరిని జాన్సన్‌కు మోదీ వివరించారని చెప్పారు. దీనిపై జాన్సన్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఉగ్ర మూకలను సహించం
ఇంగ్లండ్‌ వేదికగా ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే ఉగ్ర మూకలను సహించబోమని బోరిస్‌ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఖలిస్తాన్‌ మద్దతుదారులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం ప్రధానుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని ష్రింగ్లా చెప్పారు. దీనిపై భారత్‌ ఆందోళనను బోరిస్‌ అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి గ్రూపులను ఎదుర్కొనేందుకు సంయుక్త ంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంపై నేతలు చర్చించారన్నారు. అక్కడ సత్వరమే శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారని చెప్పారు. రష్యాపై ఆంక్షల విషయంలో భారత్‌పై యూకే ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కీవ్‌లో వచ్చేవారం తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తామని బోరిస్‌ వెల్లడించారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన జరగాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత్‌–ఇంగ్లండ్‌ బంధం.. అత్యంత పటిష్టం
భారత్, ఇంగ్లండ్‌ మధ్య అన్ని విషయాల్లోనూ బంధం ముందెన్నడూ లేనంత బలోపేతంగా మారిందని ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో శుక్రవారం ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించారు. దీపావళి నాటికి రెండుదేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపవుతుందని, వినిమయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. ఎఫ్‌టీఏలోని 26 అంశాల్లో నాలుగింటిపై గతంలో జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరిందని, మిగతా వాటిపై పురోగతి కనిపించిందని అధికారులు తెలిపారు.

ఇండియాకు ఒజీఈఎల్‌ (ఓపెన్‌ జనరల్‌ ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌) ఇస్తామని, దాంతో రక్షణ రంగ వాణిజ్యానికి అడ్డంకులు తొలగుతాయని జాన్సన్‌ చెప్పారు. భూ, జల, వాయు, సైబర్‌ మార్గాల్లో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించామన్నారు. నూతన ఫైటర్‌ జెట్‌ టెక్నాలజీని భారత్‌తో పంచుకుంటామన్నారు. చర్చల్లో మంచి పురోగతి కనిపించిందని మోదీ చెప్పారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి యూకే సాయం చేస్తుందన్నారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛపై యూకే ఆరంభించిన ఐపీఓఐని స్వాగతించారు. విద్య, వైద్యం, పునర్వినియోగ ఇంధనం తదితర అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి.

సచిన్, అమితాబ్‌లా ఫీలవుతున్నా: జాన్సన్‌
భారత్‌లో తనకు అత్యంత ఆదరణపూర్వక స్వాగతం లభించిందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సంతోషం వ్యక్తం చేశా రు. ప్రధాని నరేంద్ర మోదీని తన ఖాస్‌ దోస్త్‌ (బెస్ట్‌ ఫ్రెండ్‌)గా అభివర్ణించారు. పలుమార్లు నరేంద్ర అని ప్రస్తావిస్తూ తమ సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. బ్రిటీష్‌ ఇండియన్లలో దాదాపు సగంమందికి పుట్టిల్లైన గుజరాత్‌ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ తనకు లభించిన ఆదరణ చూస్తే సచిన్‌ టెండూల్కర్‌లాగా ఫీలవుతున్నానని, ఎక్కడచూసినా అమితాబ్‌ బచ్చన్‌ లాగా తన పోస్టర్లే కనిపిస్తున్నా యని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య బంధం ఎంతో కీలకమన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌ వద్ద జాన్సన్‌కు ఘనంగా గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ స్వాగతం లభించింది.

నా భుజానికున్నది భారతీయ టీకానే!
తనతో సహా వందకోట్లమందికి పైగా ప్రజలకు భారత్‌ కోవిడ్‌ టీకా అందించిందని బోరిస్‌ ప్రశంసించారు. ‘ నా భుజానికున్నది ఇండియన్‌ టీకా, అది నాకు ఎంతో మేలు చేసింది. భారత్‌కు కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఆశించినట్లు ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్‌ మారిందని కొనియాడారు. ఆస్ట్రాజెనెకా, సీరమ్‌ సహకారంతో కోవిడ్‌ టీకా రూపొందించడాన్ని ప్రస్తావించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement