
మేదినీపూర్: పశ్చిమ బెంగాల్(West Bengal)లోని మేదినీపూర్ జిల్లాలో అవమానభారంతో ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పన్స్కురాలోని గోసైన్బర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రాంతానికి చెందిన దుకాణదారుడు.. చిప్స్ ప్యాకెట్లు దొంగిలించావని ఆరోపిస్తూ ఒక బాలుడి చేత గుంజీలు తీయించాడు. అందరిముందు దుకాణదారుడు అవమానించడంతో తీవ్రంగా కలత చెందిన ఆ 12 ఏళ్ల బాలుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో చదువుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పన్స్కురాలోని ఒక స్వీట్ షాపు బయట వేలాడదీసిన చిప్స్ ప్యాకెట్లు గాలికి ఎగిరిపోయాయి. వాటిని ఒక బాలుడు తీసుకున్నాడు. దీనిని గమనించిన దుకాణం యజమాని షువాంకర్ దీక్షిత్ ఆ బాలుడిని పట్టుకుని, తీవ్రంగా దండిస్తూ, చెవులు పట్టుకుని గుంజీలు తీయాలంటూ బలవంతం చేశాడు. అలాగే ఆ చిప్స్ ప్యాకెట్లకు రూ. 15 చెల్లించాలని డిమాండ్ చేశాడు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆ బాలుని తల్లి కుమారుని మందలించడమే కాకుండా చెంపదెబ్బ కొట్టింది. దీంతో కలతచెందిన ఆ బాలుడు తాను ఎటువంటి చోరీ చేయలేదని తల్లికి చెప్పాడు. ఆ తరువాత పురుగుల మందు తాగాడు. వెంటనే స్థానికులు బాలుడిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దుకాణం యజమాని దీక్షిత్ పరారయ్యాడు. బాలుని మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: యూపీలో నాలుగు కోవిడ్-19 కేసులు నమోదు