
బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్షాల ఆగ్రహం
వెంటనే చర్చ చేపట్టాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్
యథావిధిగా కొనసాగిన నిరసనలు, నినాదాలు
ఉభయ సభలు పలుమార్లు వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజు గురువారం ఎలాంటి కార్యకలాపాలు చోటుచేసుకోలేదు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతోపాటు కీలక అంశాలపై విపక్షాలు తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. ఆయా అంశాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రభుత్వం స్పందించాలని తేలి్చచెప్పాయి. నిరసనలు, నినాదాలు యథావిధిగా కొనసాగించాయి.
ఉభయ సభలకు అంతరాయం కలిగించాయి. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. సభకు సహకరించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని స్పీకర్ బిర్లా కోరినా వారు వినిపించుకోలేదు. సభకు అంతరాయం సరైన పద్ధతి కాదని స్పీకర్ హితవు పలికారు.
సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పరిస్థితిలో మార్పు రాలేదు. గోవా అసెంబ్లీలో ఎస్టీలకు సీట్ల కేటాయింపునకు సంబంధించిన బిల్లుపై చర్చలో పాల్గొనాలని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్æ విజ్ఞప్తి చేయగా, విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. ఎస్టీలకు సంబంధించిన బిల్లుపై చర్చకు అడ్డుపడడం పట్ల విపక్షాలపై న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో సభాపతి లోక్‌సభను శుక్రవారానికి వాయిదావేశారు.
రాజ్యసభలోనూ గందరగోళం
బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఉదయం రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వారు అలజడి సృష్టించడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత క్యారేజీ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లుపై చర్చ మొదలైంది. దీనిపై ఏఐఏడీఎంకే నేత తంబిదురై మాట్లాడారు. ఇంతలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి చేరుకొని నినాదాలతో హోరెత్తించారు.
తంబిదురై తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయోధ్యరామిరెడ్డి మాట్లాడారు. విపక్ష ఎంపీలు తమ నినాదాలు ఆపలేదు. సభలో వారి ప్రవర్తన పట్ల బీజేపీ ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితాను కోరారు. ప్రతిపక్ష నేత ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ విన్నవించారు. అందుకు సభాపతి అంగీకరింకపోవడంతో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దాంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో ప్రాంగణంలో నిరసన
బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఓటు బందీని ఆపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సోనియా గాం«దీ, ప్రియాంకా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విపక్షాలు ప్రదర్శించిన ప్లకార్డుల్లో లోక్‌తంత్ర బదులు లోక్‌తంతర్ అని రాసి ఉండడంతో బీజేపీ‡ నేత మాలవీయా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ఏది ఎలా రాయాలో తెలియనివారు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.