బీజేపీ ఎంపీలకు ‘త్రీ-లైన్’ విప్ జారీ | BJP Issues Whip: Orders Full Attendance Of MP's | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీలకు ‘త్రీ-లైన్’ విప్ జారీ

Apr 12 2026 11:58 AM | Updated on Apr 12 2026 12:56 PM

BJP Issues Whip: Orders Full Attendance Of MP's

ఢిల్లీ: ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో బీజేపి (BJP) తన ఎంపీలకు 'త్రీ-లైన్ విప్' జారీ చేసింది. ఈ సమావేశాల సమయంలో పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా పార్లమెంట్‌కు హాజరుకావాలని ఆదేశించింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున, సభ్యులందరూ సభకు హాజరై ప్రభుత్వానికి మద్దతు తెలపాలని పార్టీ చీఫ్ విప్ స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రులతో సహా ఎంపీలందరూ ఈ మూడు రోజుల పాటు సభలోనే ఉండాలని.. ఈ సమయంలో ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని, హాజరు కచ్చితంగా ఉండాలని విప్ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుంది. ముఖ్యంగా, రిజర్వేషన్ల అమలు కాలపరిమితికి సంబంధించి కీలక సవరణలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

2023 నాటి 'నారీ శక్తి వందన్ అధినియం' ప్రకారం.. మహిళా రిజర్వేషన్లు తదుపరి జనాభా గణన మరియు నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) తర్వాతే అమలు కావాల్సి ఉంది. అయితే, జనాభా గణనలో జాప్యం జరుగుతున్నందున 2011 జనాభా లెక్కల ఆధారంగానే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు, ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెట్టాలన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే  బిల్లు తీసుకొస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపై స్పష్టత లేకుండా, ఈ చారిత్రాత్మక చట్టంపై అర్థవంతమైన చర్చ జరపడం అసాధ్యమని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement