
బీహార్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్ పర్యటన వేళ.. రాజకీయ విమర్శలతో దుమారం చెలరేగింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే తరఫున రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రకు స్టాలిన్ మద్దతు ప్రకటించారు. అయితే ఒకప్పుడు బీహారీలను అవమానించినవారే.. ఇప్పుడు ఓట్ల కోసం అక్కడికి వెళ్తున్నారా? అంటూ అధికార జేడీయూ, బీజేపీ కూటమి విమర్శలు గుప్పించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటనపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనడానికి స్టాలిన్ బీహార్ చేరుకున్నారు. అయితే, గతంలో డీఎంకే నేతలు చేసిన యాంటీ బీహారీ కామెంట్లతో పాటు సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీ స్టాలిన్‌ను సవాల్ విసిరింది.
బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ ఉంచారు. నోరు తెరిస్తే నీతి, ఆత్మగౌరవం కోసం నిలబడి మాట్లాడే వ్యక్తిని అంటారు కదా? ద్రవిడ మోడల్‌కు సింహం లాంటోడిని అంటారు కదా?. అదే నిజమైతే.. గతంలో మీ పార్టీ వాళ్లు చేసిన వ్యాఖ్యలు బీహార్‌లో మీరూ చెప్పండి చూద్దాం అంటూ సవాల్ చేశారాయన.
రెండేళ్ల కిందట.. ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఉదయ్‌నిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూలతో పోలుస్తూ.. నిర్మూలించాల్సిన అవసరం ఉందటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో జూనియర్ స్టాలిన్‌పై కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. అలాగే..
డీఎంకేకు చెందిన దయానిధి మారన్ బీహారీలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలనూ బీజేపీ లేవనెత్తుతోంది. బీహారీలు.. అశ్లీలంగా ఉంటారు. అజ్ఞానులు. పానిపూరి అమ్మేపనులు, టాయిలెట్లు శుభ్రం చేస్తుంటారు అని మారన్ అన్నట్లు బీజేపీ చెబుతోంది. ఇవే వ్యాఖ్యలను ఇప్పుడు స్టాలిన్ బీహార్‌లో మళ్లీ వినిపించాలంటూ సవాల్ చేస్తోంది. తిరుపతి మాత్రమే కాదు బీజేపీ నేత అన్నామలై కూడా ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. స్టాలిన్ బీహార్ వేదికపై వాటిని తిరిగి చెప్పాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు బీహార్ జేడీయూ నేత అభిషేక్ ఝా కూడా స్టాలిన్ పర్యటనను తప్పుబడుతూ, "ఇలాంటి వ్యక్తులతో కలిసి బీహార్ ప్రజల మద్దతు ఆశించడం తేజస్వీ యాదవ్‌కు మైనస్ అవుతుంది" అన్నారు. ఇదిలా ఉంటే.. బీహార్ ఎన్నికల వేళ, ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిపై ఎంత ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.