రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు.. | Sakshi
Sakshi News home page

G20 Summit: రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు.. ఎవరెవరికి బస ఎక్కడంటే..?

Published Thu, Sep 7 2023 6:50 PM

Biden Sunak Other Leaders Arrive In Delhi Tomorrow - Sakshi

ఢిల్లీ: జీ20 సమావేశానికి హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు ఢిల్లీకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తదితరులకు  రెండు రోజుల పాటు దేశ రాజధానిలో అతిథ్యం ఇవ్వనున్నారు.

భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే జీ20 కార్యక్రమంలో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్,  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కానున్న విషయం తెలిసిందే.

రిషి సునాక్‌..
బ్రిటన్‌కు చెందిన తొలి భారత సంతతి ప్రధానమంత్రి రిషి సునక్ సెప్టెంబర్ 8న శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనకు స్వాగతం పలుకుతారు. ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్‌లో రిషి సునాక్‌కు బస ఏర్పాట్లు చేశారు.

జో బైడెన్‌..
శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఢిల్లీ చేరుకుంటారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి VK సింగ్ స్వాగతం పలుకుతారు. జో బైడెన్‌కు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బస ఏర్పాట్లు చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన జీ20 సమావేశాలకు హాజరవుతారా..? లేదా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కానీ బైడెన్‌కు కరోనా నెగటివ్ రావడంతో ఆయన భారత్‌కు రానున్నారు. 

జస్టిన్ ట్రూడో..
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రేపు సాయంత్రం 7 గంటలకు భారత్‌కు చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆయనకు ఆహ్వానం పలుకుతారు. ట్రూడో ఢిల్లీలోని లలిత్ హోటల్‌లో బస చేస్తారు. కెనడాలో ఈ మధ్య ఖలిస్థానీ ఉగ్రవాదం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన భారత్‌కు రావడం ప్రధాన్యత సంతరించుకుంది. 

జపాన్ ప్రధాని
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా రేపు భారత్‌కు వస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు పాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగుతారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆహ్వానం పలుకుతారు. కిషిదా భారత్‌కు రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన.. ప్రధాని మోదీతో సమావేశమై భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు.

ఇదీ చదవండి: Sanathana Dharma Row: అందుకే దేవాలయానికి వెళ్లలేదు.. సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..


 

Advertisement
 
Advertisement