కోవాగ్జిన్‌ తీసుకున్న వలంటీర్‌ మృతి

Bhopal Volunteer Dies 10 Days After Taking Bharat Biotech Covaxin - Sakshi

మరో వివాదంలో భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌

వలంటీర్‌ మృతితో వ్యాక్సిన్‌ పట్ల అనుమానం

విషప్రయోగం జరిగి ఉంటుందని వైద్యుల అనుమానం

భోపాల్‌: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పట్ల ప్రజల్లో పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో టీకా‌ తీసుకున్న వారు మృతి చెందారనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకుని ఇద్దరు నర్సులు మృతి చెందారని విన్నాం. తాజాగా ఈ జాబితాలోకి దేశీయ వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ కూడా చేరింది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌ టీకా కోవాగ్జిన్‌ తీసుకున్న ఓ వలంటీర్‌ పది రోజుల తర్వాత మృతి చెందాడనే వార్త ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే మూడోదశ ట్రయల్స్‌ పూర్తి కాకుండానే వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతివ్వడం పట్ల విపక్షాలు విమర్శలు చేస్తుండగా.. తాజాగా వలంటీర్‌ మృతి చెందడం వివాదాన్ని మరింత పెంచుతోంది. వివరాలు.. భోపాల్‌కు చెందిన దీపక్ మరవి (42) గతేడాది డిసెంబర్‌ 12న పీపుల్స్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హస్పిటల్‌లో నిర్వహించిన కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొని కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత పది రోజులకు అతడు మరణించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కోవాగ్జిన్‌ ట్రయల్‌లో పాలు పంచుకున్న మెడికల్‌ కాలేజీ వైస్‌ చాన్సిలర్‌ మాట్లాడుతూ.. ‘దీపక్‌ మరవి వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో భాగంగా కోవాగ్జిన్‌ డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు మరణించినట్లు తెలిసింది. విష ప్రయోగం వల్ల చనిపోయాడని అనుమానిస్తున్నాం.. కానీ మరణానికి అసలు కారణం ఇంకా తెలియలేదు. విసెరా పరీక్షతో మరవి ఎందువల్ల చనిపోయాడనే విషయం తెలుస్తుంది’ అన్నారు. (మా వ్యాక్సిన్‌ చాలా డేంజర్‌: చైనా ఎక్స్‌పర్ట్‌)
 
ఇక మధ్యప్రదేశ్‌ మెడికో లీగల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అశోక్‌ శర్మ మాట్లాడుతూ.. ‘దీపక్‌ మరవికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు.. విషప్రయోగం వల్ల అతడు చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నాడు. కానీ అసలు కారణం ఇంకా తెలియలేదు. ఇక మరవి గతేడాది డిసెంబర్‌ 21న చనిపోయాడు. ఈ విషయాన్ని డీసీజీఐ, భారత్‌ బయోటెక్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఇక వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొనడాకి ముందు మరవికి అన్ని పరీక్షలు చేశాం. అంతా బాగుంది అనుకున్నాకే వ్యాక్సిన్‌ డోసు తీసుకునేందుకు అనుమతిచ్చాం. ఇక ట్రయల్స్‌లో పాల్గొన్న అందరికి వ్యాక్సిన్‌ ఇవ్వరు. సగం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చి.. మిగతావారికి సెలైన్‌ ఇస్తారు. ప్రస్తుతం దీపక్‌కి ఇచ్చింది వ్యాక్సిన్‌ డోసా లేకా.. సెలైనా అనే విషయం తెలియాలి. ఇక ట్రయల్స్‌లో పాల్గొన్న అందరిని వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపించాం.. ఆ తర్వాత ఎనిమిది రోజులు వారిని అబ్జర్వేషన్‌లో ఉంచాం’ అని తెలిపారు. (చదవండి: టీకాపై ఎటూ తేల్చుకోలేక..)

ఇక మరవి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్‌ తీసుకుని ఇంటికి వచ్చాక.. అతడు కొంత ఇబ్బంది పడ్డాడు. అనారోగ్య సమస్యలు తలెత్తాయి. డిసెంబర్‌ 17న భుజం నొప్పితో బాధపడ్డాడు. రెండు రోజుల తర్వాత నోటి నుంచి నురగ వచ్చింది. డాక్టర్‌ దగ్గరకు వెళ్దాం అంటే వినలేదు. రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందని తెలిపాడు. ఇలా ఉండగానే అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇక డిసెంబర్‌ 21న ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మధ్యలోనే చనిపోయాడు’ అని తెలిపారు. ఇక రజనా ధింగ్రా అనే సామాజిక కార్యకర్త దీపక్‌ మరవి ట్రయల్స్‌లో పాల్గొన్నాడనే దానికి రుజువుగా అతడికి ఎలాంటి రసీదు, లెటర్‌ లాంటిది ఇవ్వలేదని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top