
ఫకీర్ చంద్ కోహ్లీ
దేశంలోని నాలుగు దిగ్గజ ఐటీ సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో లక్షమందికి పైగా ప్రొఫెషనల్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పించాయి. భారతీయ ఐటీ పరిశ్రమ అసాధారణ వేగంతో ముందుకు సాగుతోందనటానికి ఈ నియామకాలు తిరుగులేని సంకేతం. దేశంలోని నాలుగు ప్రముఖ ఐటీ సంస్థలు – టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో లక్షమందికి పైగా వృత్తి నిపుణులైన యువతను ఉద్యోగాల్లో నియమించాయి.
ఆ ముందరి ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 రెట్లు ఎక్కువ. ఉత్తమ నాయకత్వం, సరైన మార్గదర్శకత్వం కారణంగానే ఇంతటి పురోగతి సాధ్యపడింది. ఈరోజు సమాచార సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ఒక నిగూఢ శక్తిగా యావత్ ప్రపంచం గుర్తిస్తోంది. భారత ఐటీ రంగం విలువ 190 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఈ ఘనత మాత్రం ఫకీర్ చంద్ కోహ్లీకే దక్కాలి. దేశంలోనే ఐటీ రంగానికి పునాది వేసిన వ్యక్తి ఈయన. అలాంటి కోహ్లీ, రతన్ టాటాలతో కలిసి పనిచేసిన చంద్రశేఖరన్ ఒక సృజనాత్మక సంస్కృతిని, ప్రతిభాపాటవాలను నేర్చుకున్నారు. ఇటువంటి శక్తి సామర్థ్యాలతో భారత ఐటీ కంపెనీల శరవేగ పురోగతితో అసంఖ్యాక యువతకు ఉద్యోగ అవకాశాలు రావడమే కాదు, దేశం భారీ మొత్తంలో ఆదాయ పన్నును, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. అయితే ఈ కంపెనీలు అసాధారణ విజయాన్ని పొందటానికి బలమైన, స్ఫర్ధాస్వభావం కలిగిన నాయకత్వమే కారణమని గ్రహించాలి. ఇలాంటి నాయకత్వం దేశాన్ని ముందుకు తీసుకెళుతుంది. వచ్చే పాతికేళ్లలో మనం ఈ స్పష్టమైన పురోగతిని మరింతగా వీక్షించబోతున్నాం.