
బికనీర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతీ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రధాన మోదీ హెచ్చరించారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన అనంతరం పలానాలో జరిగిన ప్రజా ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్(Pakistan) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని, అది ఆ దేశ సైన్యం, ఆర్థిక వ్యవస్థ భరించాల్సి వస్తుందన్నారు. పాక్ ఉగ్రవాదం ఎగుమతిని కొనసాగిస్తే, ఆ దేశం ఒక్క రూపాయి కోసం కూడా తడబడే పరిస్థితి వస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. భారతీయుల రక్తంతో ఆడితే పాకిస్తాన్ దానికి భారీ మొత్తంలో నష్టం చవిచూడాల్సి వస్తుందన్నారు.
ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని, ఇకపై ఉగ్ర దాడి జరిగినట్లయితే, తక్షణమే దానికి కఠిన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు.. ఇందుకు సమయాన్ని, విధానాన్ని, నిబంధనలను భారత సైన్యం స్వయంగా నిర్ణయిస్తుందన్నారు. అణ్వాయుధాల బెదిరింపులతో భారతదేశం వెనక్కి తగ్గబోదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యక్తులను, ప్రభుత్వాన్నీ వేరు చేయలేమని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో ‘స్టేట్’, ‘నాన్-స్టేట్ యాక్టర్స్’ (గూండాలు) కలసి ఆడే ఆటలు ఇక కొనసాగవన్నారు. 22వ తేదీన జరిగిన పాక్ దాడికి ప్రతిగా 22 నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేశామని ప్రధాని పేర్కొన్నారు.

భారత్ ప్రతీకార దాడి చేస్తే ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో ప్రపంచానికి స్పష్టంగా చూపించామని, ప్రతి భారతీయుడు(Indian) ఉగ్రవాదాన్ని నేలమట్టం చేయాలనే సంకల్పంతో ఉన్నారడన్నారు. భారత సైన్యం ప్రజల ఆశీర్వాదంతో ఆ సంకల్పాన్ని నెరవేర్చిందన్నారు. భారత ప్రభుత్వం మూడు దళాలకూ పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. పాకిస్తాన్‌ను మోకాళ్లపై సాగిలపడేలా చేయడానికి భారత సైన్యం చక్రవ్యూహం రచించిందని ప్రధాని మోదీ అన్నారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా మే 7న భారత్ ప్రతీకార సైనిక చర్య ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ సమయంలో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద గ్రూపులతో సంబంధమున్న దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇది కూడా చదవండి: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ