
చెన్నై: తమిళనాడులోని కుంభకోణం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కే. శరవణన్ ఎన్నికయ్యారు. వృత్తిరీత్యా ఆయన ఆటో డ్రైవర్. మేయర్‌గా ఎన్నికవడం తనకు సంతోషమేనని, అయితే ప్రజలకు సేవ చేస్తూ ఆటో నడపడంలో మరింత ఆనందం ఉందని ఆయన చెప్పారు. మేయర్‌గా పదవీ స్వీకారం చేసిన తర్వాత నగరంలో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయడంపై దృష్టి పెడతానని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన 17వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పోటీ చేసింది.