ఎగ్జిట్‌ పోల్స్‌ అంటేనే బీజేపీకి ఫేవర్‌! మరి ‘ఢిల్లీ’ సంగతి.. ఆప్‌ స్పందన ఇదే

Always Favour BJP AAP Raghav Chadha Hits Back - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు ఉప ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌పై రాజకీయ చర్చ నడుస్తోంది. ప్రధానంగా గుజరాత్‌ ఎన్నికలే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే.. 

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌లో తమకు ప్రతికూలంగా ఫలితాలు రావడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్‌ చద్దా స్పందించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అనేవి ఎప్పుడూ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయని పేర్కొన్నారాయన. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఆప్‌ ఓటర్లు మౌనంగా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. వాళ్లు ఎగ్జిట్‌ పోల్‌ అంచనాకి చిక్కరు అంటూ కామెంట్‌ చేశారు. మరి.. 

ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్‌కి అనుకూలంగా ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చాయి కదా అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఢిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ కంటే ఉత్తమ ప్రదర్శనే ఆప్‌ చూపించబోతోంద’’ని చద్దా  తెలిపారు. గుజరాత్‌లో ఆప్‌ కో-ఇన్‌ఛార్జిగా ఒక మాట చెప్పదల్చుకున్నా.. ఒక పార్టీ కొత్తగా ఒక రాష్ట్రంలో పోటీ చేస్తున్నప్పుడు ఇలా తక్కువ అంచనా వేయడం సహజమే. ఇలాగే ఢిల్లీలో 2013లో ఆప్‌ పోటీ చేసినప్పుడు.. మూడు, నాలుగు కంటే ఎక్కువ సీట్లు గెల్చుకోకపోవచ్చనే అంచనా వేశారు. కానీ, 28 సీట్లు గెల్చుకుంది కదా!. 

అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ గణనీయమైన ఓట్లను సాధించి గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు రాఘవ్‌ చద్దా. ఇదిలా ఉంటే.. ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ గుజరాత్‌లో ఆప్‌ 90 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమంటూ ప్రకటించారు. 

ఇదీ చదవండి: మంచు కొండల్లో పోటాపోటీ!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top