కాంగి‘రేసు’.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలపైనే అందరి దృష్టి

All eyes are on Congress presidential election - Sakshi

స్వాతంత్య్రం వచ్చాక నాలుగోసారి ఎన్నిక 

40 ఏళ్లు గాంధీ కుటుంబం చేతిలోనే కాంగ్రెస్‌

24 ఏళ్ల తర్వాత ఇతరులకి అవకాశం రావడంతో ప్రాధాన్యం  

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గాంధీ కుటుంబానికి చెందిన సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి విముఖంగా ఉండడంతో పోటీ అనివార్యమైంది. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది నాలుగోసారి.1998లో సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టాక అన్నిసార్లు ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగింది. ఈ సారే అధ్యక్ష ఎన్నికకు పోటీ జరుగుతోంది.  

ఎన్నిక ప్రక్రియ సాగేదిలా..
కాంగ్రెస్‌ పార్టీ నియమావళిలోని సెక్షన్‌  గీVఐఐఐ ప్రకారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. సోనియాగాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే సంస్థాగతంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు స్వతంత్రంగా వ్యవహరించే సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ (సీఈఏ) ఏర్పాటు చేశారు. గుజరాత్‌ మాజీ ఎంపీ మధుసూదన్‌ మిస్ట్రీ ప్రస్తుతం సీఈఏ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దీని ఆధ్వర్యంలోనే అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. పార్టీ ఎలక్టోరల్‌ కాలేజీలో 9 వేల మందికి పైగా ప్రతినిధులు ఉన్నారు. వీరందరికీ ఓటు వేసే హక్కు ఉంది. పార్టీలో ప్రతినిధుల్ని ఎన్నుకొనే ప్రక్రియ కూడా ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది.

క్షేత్రస్థాయిలో ఉన్న బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీలు పీసీసీ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. పీసీసీ ప్రతినిధులు ఏఐసీసీ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. వీరితో పాటు పీసీసీ అధ్యక్షులుగా కనీసం ఒక సంవత్సరం పదవిలో ఉన్న వారు, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించే ఏఐసీసీ సభ్యులు, పార్టీ ఎమ్మెల్యేలు, పీసీసీ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులందరూ ప్రతినిధులుగానే ఉంటారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారు తప్పనిసరిగా పార్టీలో ప్రతినిధి అయి ఉండాలి. పార్టీ ప్రతినిధుల్లో 10 మంది వారిని ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామినేషన్‌ ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక ఇద్దరు పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ఒక్కరే ఉంటే వారి ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.  

అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరిగాయంటే  
► 1950లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆచార్య కృపలాని, పురుషోత్తమ్‌ దాస్‌ టాండన్‌ మధ్య గట్టి పోటీ జరిగింది. అప్పట్లో ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ మద్దతునిచ్చిన కృపలాని ఓడిపోయారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అనుచరుడిగా ముద్ర పడిన టాండన్‌ అధ్యక్షుడయ్యారు. టాండన్‌కు 1,306 ఓట్లు వస్తే, కృపలానీకి 1,092 ఓట్లు వచ్చాయి.  
► ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో 47 ఏళ్ల తర్వాత ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. 1997లో జరిగిన ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది. సీతారామ్‌ కేసరి, శరద్‌ పవార్, రాజేశ్‌ పైలట్‌ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో సీతారాం కేసరి బంపర్‌ మెజార్టీ సాధించారు. మహారాష్ట, యూపీ మినహాయించి అన్ని రాష్ట్రాల యూనిట్లు కేసరికే జై కొట్టారు.  కేసరికి 6,224 ఓట్లు వస్తే, పవార్‌కు 882, పైలెట్‌కు 354 ఓట్లు వచ్చాయి.  
► 2000లో కూడా అధ్యక్ష ఎన్నిక జరిగింది. సోనియాగాంధీపైన జితేంద్ర ప్రసాద సవాల్‌ విసిరారు.  ప్రసాద ఘోరమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సోనియాకు 7,400 ఓట్లు లభిస్తే జితేంద్ర ప్రసాదకి 94 ఓట్లు వచ్చాయి.  
► 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి అధ్యక్ష ఎన్నిక అనివార్యంగా మారింది.  

75 ఏళ్లలో 16 మంది అధ్యక్షులు  
ఈ 75 ఏళ్లలో 40 ఏళ్లపాటు గాంధీ కుటుంబమే పార్టీని నడిపించింది.స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌కి 16 మంది అధ్యక్షులైతే వారిలో అయిదుగురు గాంధీ కుటుంబానికి చెందినవారే. నలుగురు తెలుగువాళ్లు పట్టాభి సీతారామయ్య,  దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, పీవి నరసింహారావు అధ్యక్షులుగా వ్యవహరించారు. 1947లో ఆచార్య కృపలాని, 1948–49లో పట్టాభి సీతారామయ్య ఆ తర్వాత టాండన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. నెహ్రూ 1951–55 వరకు, ఆ తర్వాత యూఎన్‌ ధేబర్‌  పగ్గాలు చేపట్టారు. 1959లో ఇందిరతొలిసారి అధ్యక్షురాలయ్యారు.

ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కామరాజ్, నిజలింగప్ప, జగజ్జీవన్‌ రామ్, శంకర్‌ దయాళ్‌ శర్మ, దేవకాంత్‌ బారువా అధ్యక్షులుగా ఉన్నారు. 1978–1984 సంవత్సరాల మధ్యలో ఇందిర మళ్లీ పగ్గాలు చేపట్టారు. ఇందిర హత్యానంతరం రాజీవ్‌ గాంధీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి 1991 వరకు ఉన్నారు. రాజీవ్‌ హత్యానంతరం పీవీ నరసింహారావు పగ్గాలు చేపట్టి 1996 వరకు కొనసాగారు. 1996–98 మధ్య సీతారాం కేసరి అధ్యక్షుడిగా ఉన్నారు. 1998లో అధ్యక్షురాలైన సోనియా 19 ఏళ్లు పదవిలో ఉండి రికార్డు సృష్టించారు. 2017–2019 కాలంలో రాహుల్‌ గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2019 నుంచి సోనియా కొనసాగుతున్నారు. 

నామినేషన్ల ఉపసంహరణకు గడువు : అక్టోబర్‌ 8
పోలింగ్‌ తేదీ : అక్టోబర్‌ 17
ఫలితాల ప్రకటన : అక్టోబర్‌ 19

– నేషనల్‌ డెస్క్, సాక్షి  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top