దేశంలో కొత్తగా 100 సైనిక పాఠశాలలు

Affiliation of 100 Schools with Sainik School Society Approved - Sakshi

రాష్ట్రాలు, స్వచ్ఛంద, ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు 

2025–26 వరకు స్వచ్ఛ భారత్, అటల్‌ మిషన్‌ కొనసాగింపు 

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 సైనిక పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న కొత్త సైనిక పాఠశాలల్లో 6వ తరగతిలో 5వేల మంది విద్యార్థులను చేర్చుకుంటారు. వీటి ఏర్పాటులో రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక పాఠశాలల్లో 6వ తరగతి విద్యార్థులు 3వేల మంది ఉన్నారు. అదేవిధంగా, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (అర్బన్‌) అటల్‌ మిషన్‌ 2025–26 వరకు కొనసాగించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) ఫలితాల సుస్థిరత, అన్ని నగరాల్లో ఘన వ్యర్థాల శాస్త్రీయ ప్రాసెసింగ్‌ సాధించడం, లక్ష లోపు జనాభా ఉన్న నగరాల్లో వ్యర్థ జలాల నిర్వహణపై దృష్టి సారించనుంది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌(పట్టణ) 2.0 నిమిత్తం రూ.1,41,600 కోట్లు కేటాయించగా దీంట్లో కేంద్ర వాటా రూ.36,465 కోట్లు. పథకం చివరి దశకు చేరే నాటికి కేంద్రం వాటా రూ.62,009 కోట్లకు పెరుగుతుంది. పట్టణ పరివర్తన, పునరుజ్జీవనకు అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజునవేషన్, అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (అమృత్‌) 2.0ను 2025–26 వరకు సాగించేందుకు మంత్రివర్గం అనుమతించింది. ఈ పథకం వ్యయం రూ.2,77,000 కోట్లు కాగా కేంద్రం వాటా రూ.76,760 కోట్లుగా ఉంది.

తాజాగా 4,378 పట్టణాల్లో గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. 500 అమృత్‌ నగరాల్లో వందశాతం మురుగునీటి నిర్వహణతోపాటు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లు, 2.64 కోట్ల మురుగు నీటి కనెక్షన్లు అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ 1 నుంచి మార్చి 2022 వరకూ నైట్రోజన్, ఫాస్పరస్, పొటాష్, సల్ఫర్‌లకు పోషక ఆధారిత సబ్సిడీ రేట్లకు ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. కేజీ సబ్సిడీ ధర నత్రజనికి రూ.18.789, పాస్ఫరస్‌కి రూ.45.323, పొటాష్‌ రూ.10.116, సల్ఫర్‌కు రూ.2.374కు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీని అమలుతో రూ.28,602 కోట్ల భారం పడుతుందని కేంద్రం పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top