కాటేసిన విషసర్పాన్ని చంపి.. ఆస్పత్రికి పట్టుకెళ్లిన బాలుడు

7 Year Old Boy Saves His Lide From Russells Viper Bite - Sakshi

తమిళనాడులో ఏడేళ్ల చిన్నారి సాహసం

సాక్షి ప్రతినిధి, చెన్నై: పాము కాటేసినా ఏ మాత్రం భయపడలేదు. వెంటపడి చంపేశాడు. చచ్చిన పామును చేతబూని ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొంది ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. ఈ సాహసం చేసింది ఏడేళ్ల బాలుడు కావడం విశేషం. తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టకు చెందిన రాము కుమారుడు దర్షిత్‌ (7) మూడో తరగతి చదువుతున్నాడు. ఈనెల 16వ తేదీన వెల్‌లైకోట్టై గ్రామంలోని తన అవ్వ వద్దకు వెళ్లి పొలంలో ఆడుకుంటుండగా ఏదో కరిచినట్లు గ్రహించాడు.

ఆ బాలుడు వెంటనే అక్కడ వెతకగా రక్తపింజరి జాతి విషనాగు పాకుతూ వెళుతుండగా చూశాడు. పొలంలోని మొక్కల మధ్య దానిని వెంటాడి వేటాడి పట్టుకుని రాళ్లతో కొట్టి హతమార్చాడు. చచ్చిన పామును చేతపట్టుకుని ఇంటికి చేరుకుని తల్లిదండ్రులతో కలిసి కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. పాము కాటేసినా బాలుడిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో రెండురోజులు ఆస్పత్రిలో ఉంచి పంపించేశారు. అయితే ఆ తరువాత బాలుడి కాలు వాచిపోయి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మూరులోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జ్‌ చేశారు.

ఇంటికి పంపే ముందు ఆ బాలుడితో ‘ఆస్పత్రికి చచ్చిన పామును తీసుకుని ఎందుకు వచ్చావు’ అని వైద్యులు ప్రశ్నించగా ‘నన్ను ఏ జాతి పాము కాటేసిందో తెలిస్తేనే కదా మీరు తగిన చికిత్స అందించేది’ అని బదులివ్వడంతో బిత్తరపోయారు. వైద్య బృందం అంతా కలిసి బాలుడి సాహసాన్ని, సమయోచిత తెలివితేటలను అభినందించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top