ఘోరం: 577 మంది టీచర్లు కరోనాకు బలి

577 Teachers Died Says UP Teachers Association - Sakshi

లక్నో: మహమ్మారి కరోనా వైరస్‌ రెండో దశ కల్లోలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు దయనీయంగా మారాయి. కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నా ఆ రాష్ట్రంలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున కరోనా బారినపడుతున్నారు. అయితే ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయులే కరోనా బారినపడి ఏకంగా 577 మంది చనిపోయారంట. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.

‘కరోనా బారిన అంతమంది ఉపాధ్యాయులు చనిపోయారు.. దయచేసి ఎన్నికలు వాయిదా వేయండి’ అంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. ఈ మేరకు గురువారం యూపీ శిక్షక్‌ మహాసంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్‌ చంద్ర శర్మ తమ ప్రతినిధులతో కలిసి ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చారు. మే 2వ తేదీన జరగాల్సిన ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల మృతిపై ఓ నివేదిక ఎన్నికల సంఘానికి సమర్పించారు. 71 జిల్లాల్లో 577 మంది ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారని నివేదికలో ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రస్తావించారు.

పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున కరోనా సోకిందని దినేశ్‌చంద్ర శర్మ తెలిపారు. అంతకుముందు మంగళవారం ఏప్రిల్‌ 27వ తేదీన హైకోర్టు ఉపాధ్యాయుల మరణాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా ఆ రాష్ట్రంలో కరోనా బారినపడి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మరణిస్తున్నారు. అయితే ఉపాధ్యాయుల విజ్ఞప్తిని మన్నించి ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తుందా లేదో వేచి చూడాలి.

చదవండి: ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం 24 గంటల్లో 1,300 కి.మీ జర్నీ

చదవండి: ఇప్పటివరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top