
న్యూఢిల్లీ: నకిలీ కరెన్సీ రాకెట్‌ను నడుపుతూ, ప్రపంచ ఉగ్రవాద సంస్థ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సాయపడుతున్న అల్ ఖైదాతో సంబంధం కలిగిన నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. పట్టుబడిన ఉగ్రవాద నిందితులు మొహమ్మద్ ఫైక్, మొహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీలు అల్ ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను, అనుమానాస్పద యాప్‌లను ఉపయోగించారని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. అలాగే వీరు తమ జాడ తెలియకుండా ఉండేందుకు ఆటో డిలీట్ యాప్‌లను ఉపయోగించారని సమాచారం.
ఈ నిందితులు చాలా కాలంగా ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారని గుజరాత్ ఏటీఎస్ అధికారులు గుర్తించారు. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అల్-ఖైదాతో సంప్రదింపులు జరిపారని వెల్లడైందన్నారు. వారి చాట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఈ నలుగురూ సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు సంప్రదించుకున్నారని, ఢిల్లీ నివాసి ఫైక్.. పాకిస్తాన్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌తో పరిచయం పెంచుకుని, భారతదేశంలో జిహాదీ కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి చర్చించారని తమకు తెలిసిందని తెలిసిందని గుజరాత్ ఏటీఎస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సునీల్ జోషి పేర్కొన్నారు.
ఈ నలుగురు నిందితుల ప్రధాన ఎజెండా అల్‌ఖైదా భావజాలం వైపు యువతను ఆకర్షించడం. హింస ద్వారా షరియాను స్థాపించడానికి, తద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించేందుకు యవతను ప్రేరేపించేందుకు వారు పనిచేస్తున్నారని సునీల్ జోషి తెలిపారు. వారి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో అల్‌ఖైదా సాహిత్యం, షరియాను స్థాపించాలని పిలుపునివ్వడం, మత విద్వేషాన్ని సృష్టించే ప్రకటనలు ఉన్నాయని ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
నిందితుల ప్రవర్తన ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించడానికి, భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని అణగదొక్కడానికి ఉపకరించేదిగా ఉందని డీఐజీ తెలిపారు. కాగా ఒసామా బిన్ లాడెన్ గురువు షేక్ అబ్దుల్లా అజ్జాం నెలకొల్పిన మఖ్తబ్ అల్-ఖిదామత్ నుండి అల్-ఖైదా ఉద్భవించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే సంస్థగా ఉంది. అల్-ఖైదా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లోని పెషావర్‌లో విస్తరించి ఉంది. 1996 నుండి 2001 చివరి వరకు అల్‌ఖైదాను తాలిబాన్ రక్షణలో బిన్ లాడెన్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు పర్యవేక్షించారు.