కేంద్రం, ‘మహా’ వ్యాక్సిన్‌ వార్‌

26 Mumbai Vaccine Centres Shuts In Maharashtra - Sakshi

రాష్ట్ర సర్కారు నిర్వాకం వల్లే ఈ దుస్థితి: జవదేకర్‌

న్యూఢిల్లీ/ముంబై:  కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సర్కారు మధ్య వివాదం ముదురుతోంది. ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో 5 లక్షల కరోనా టీకా డోసులు వృథా అయ్యాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విమర్శించారు. వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

తాను పూర్తి సమాచారం సేకరించానని, మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద 23 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ డోసులు మరో ఐదారు రోజులకు సరిపోతాయని అన్నారు. 5 లక్షల డోసులను వృథా చేయడం సామాన్యమైన విషయం కాదని జవదేకర్‌ ఆక్షేపించారు. సరైన ప్రణాళిక ఉంటే డోసులు వృథా అయ్యే పరిస్థితే ఉండేది కాదన్నారు. ఇతర రాష్ట్రాల కంటే మహారాష్ట్రకే అధికంగా టీకాలను అందజేస్తున్నామని గుర్తుచేశారు.

మహారాష్ట్రకు తక్కువ టీకాలిస్తున్నారు
కరోనా వ్యాక్సిన్ల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంపై వివక్ష చూపుతోందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపే ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రకు తక్కువ టీకాలు ఇవ్వడానికి గల కారణమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు అధికంగా టీకాలు సరఫరా చేస్తున్నారని విమర్శించారు. గురువారం ఉత్తరప్రదేశ్‌కు 48 లక్షల డోసులు, మధ్యప్రదేశ్‌కు 40 లక్షల డోసులు, గుజరాత్‌కు 30 లక్షల డోసులు, హరియాణాకు 24 లక్షల డోసులు ఇవ్వగా, మహారాష్ట్రకు కేవలం 7.5 లక్షల డోసులు ఇచ్చారని తప్పుపట్టారు. మహారాష్ట్రకు తక్కువ టీకా డోసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు.

నేటి నుంచి టీకా బంద్‌
ముంబైలో కరోనా టీకా నిల్వలు దాదాపు నిండుకున్నాయని నగర మేయర్‌ కిశోరీ పెడ్నేకర్‌ చెప్పారు. శుక్రవారం నుంచి టీకా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వం నుంచి టీకా డోసులు వస్తేనే కరోనా వ్యాక్సినేషన్‌ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సరిపడా వ్యాక్సిన్లు అంద డం లేదని, ఇందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె వ్యాఖ్యానించారు. టీకా తొలి డోసు తీసుకున్నవారికి రెండో డోసు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికైనా టీకాలు సరఫరా చేయకపోతే రెండో డోసు ఇవ్వలేమని అన్నారు.   

కరోనా టీకా పంపిణీలో వివక్ష లేదు  
వ్యాక్సిన్ల పంపిణీ విషయంలో రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతున్నారంటూ వెల్లువెత్తుతున్న విమర్శలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తిప్పికొట్టారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న మహారాష్ట్ర, రాజస్తాన్‌లకు అధికంగా కరోనా టీకాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాలకు టీకాల పంపిణీలో ఎలాంటి వివక్ష లేదని వెల్లడించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9.1 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో 2.4 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top