బస్సు, పికప్ ట్రక్కు ఢీ
10 మంది దుర్మరణం ∙31 మందికి గాయాలు
ఛింద్వారా: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్న ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరై తిరుగుపయనమైన పలువురు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బస్సు, పికప్ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో బస్సులోని ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు చనిపోయారు. బస్సు డ్రైవర్, పికప్ ట్రక్కు డ్రైవర్, క్లీనర్ సైతం చనిపోయారు. ఛింద్వారా జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని సిమారియా పట్టణ సమీపంలో నాగ్‌పూర్ జాతీయరహదారిపై గురువారం రాత్రి 7.15 గంటలకు ఈ ఘటనలో 31 మంది గాయపడ్డారు.
గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. వీరిలో ఒకరిని మెరుగైన వైద్యం కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించారు. మితిమీరిన వేగంతో వెళ్తూ ఒక వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సు...ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ప్రమాదం వార్త తెల్సి సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రూ.506 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ఛింద్వారా నగరంలోని పోలీస్‌మైదానంలో ఏర్పాటుచేయగా ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం ఆరు గంటలకు దాదాపు 47 మందితో ఈ ప్రైవేట్ బస్సు తిరుగుపయనమై చివరకు ప్రమాదంలో చిక్కుకుంది.


