పోలియో రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పోలియో రహిత సమాజమే లక్ష్యం

Jun 29 2026 2:11 AM | Updated on Jun 29 2026 2:11 AM

నారాయణపేట: పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలియోకు శాశ్వతంగా చెక్‌ పెట్టాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాల్సిందేనని పేర్కొన్నారు. జిల్లా లక్ష్యాన్ని సాధించేలా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారుల సంఖ్య, ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలు, మొబైల్‌ బృందాలు, ఇంటింటి సర్వే బృందాలు, వ్యాక్సిన్‌ నిల్వలు, పంపిణీ ఏర్పాట్లను ప్రోగ్రామ్‌ అధికారిని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఒక్క చిన్నారి కూడా తప్పిపోకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో జిల్లా యంత్రాంగం..

కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేసింది. గ్రామాలు, తండాలు, దూర ప్రాంతాలు, ఇటుక బట్టీలు, వలస కార్మికుల కాలనీలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసేందుకు 416 బృందాలు పనిచేశాయి. ఉదయం నుంచే ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగనన్‌వాడీ టీచర్లు, వైద్యసిబ్బంది, పర్యవేక్షకులు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేశారు. కొందరు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కేంద్రాలకు తీసుకొచ్చారు. అత్యధికంగా కోస్గి మండలంలో 8,369 మంది చిన్నారులకు, మద్దూర్‌లో 8,039, గుండుమాల్‌ 7 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయగా.. అత్యల్పంగా ఊట్కూర్‌లో 2,024 మంది చిన్నారులకు వేశారు. జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమాల్లో పుర చైర్‌పర్సన్‌ కొండా శ్వేతా, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్‌, ఆర్‌ఎంఓ డా. బాలాజీ, పోలియో ప్రోగ్రామ్‌ అధికారి డా. సాయిరాం, కౌన్సిలర్లు ప్రభాకర్‌, రాజేష్‌ ఘట్‌ పాల్గొన్నారు.

మండలం చిన్నారుల

సంఖ్య

దామరగిద్ద 5,153

ధన్వాడ 3,095

గుండుమల్‌ 7,000

కోస్గి 8,369

కోటకొండ 5,966

మద్దూర్‌ 8,039

మాగనూరు 5,533

మరికల్‌ 3,120

నారాయణపేట 4,231

నర్వ 4,097

పులిమామిడి 2,842

ఊట్కూర్‌ 2,024

మండలాల వారీగా పోలియో చుక్కలు వేసిన చిన్నారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement