కోస్గి రూరల్: బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉంటూ అర్హులైన ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో ఉండే విధంగా పర్యవేక్షించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సూచించారు. ఆదివారం పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పోలింగ్ బూత్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన యువతీ యవకులను ఓటర్లుగా నమోదు చేయించాలని, ఎన్యూమరేషన్ ఫారాలు పూరించి బీఎల్వోలకు అందజేసే సమయంలో తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని.. ఎన్యూమరేషన్ ఫారాల్లోని తప్పొప్పులను సరి చేయించాలని సూచించారు. కార్యక్రమంలో కోస్గి పుర ఇన్‌చార్జ్ వెంకటనర్సింహులు, నరేందర్‌రెడ్డి, సాయిలు, వెంకటయ్య, శ్యాసం రామకృష్ణ, కిష్టయ్య, నీలప్ప, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆర్థిక చేయూత
నారాయణపేట: తల్లిదండ్రులు లేక చదువు మధ్యలోనే ఆగిపోతుందేమోనని ఆందోళన చెందుతున్న ఇద్దరు అనాథ బాలికలకు మీ భవిష్యత్‌కు మేమున్నామంటూ అండగా నిలిచారు నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి. వివరాల్లోకి వెళ్తే.. అనాథ బాలిక పద్మశ్రీకి గతేడాది బీటెక్ విద్య కోసం అవసరమైన రూ.1.10 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆమె చదువు పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకున్నారు. తాజాగా ధన్వాడ మండలానికి చెందిన అనాథ బాలిక ఝాన్సీరాణి బీటెక్‌లో సీటు సాధించగా అడ్మిషన్, ప్రాసెసింగ్ ఫీజుకు అవసరమైన రూ.10,100 వెంటనే అందజేశారు. అంతేగాకుండా ఆమె చదువు పూర్తయ్యే వరకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల ఆదరణ కోల్పోయిన బాలికలను సొంత పిల్లల్లా భావించి వారి ఉన్నత విద్యకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు కొనియాడారు.
ఉత్సాహంగా ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి సబ్ జూనియర్ ఫుట్‌బాల్ బాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ మాట్లాడుతూ జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలకు వివిధ ప్రాంతాల నుంచి 50 మంది క్రీడాకారిణులు హాజరుకాగా 25 మందిని ప్రాబబుల్స్‌కు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి రెండు రోజులపాటు క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు కేఎస్ నాగేశ్వర్, నందకిషోర్, కోచ్‌లు రాములు, నరేష్, రాజ్‌కుమార్, ప్రేమ్, ప్రకాశ్ పాల్గొన్నారు.


