సైబర్‌ మాయలో పడొద్దు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మాయలో పడొద్దు : ఎస్పీ

Jun 29 2026 2:11 AM | Updated on Jun 29 2026 2:11 AM

నారాయణపేట: తక్కువ సమయంలో భారీ లాభాలు.. ఇంట్లో నుంచే ఉద్యోగం.. సులభంగా రుణం.. లక్కీ డ్రాలో రూ.కోట్ల బహుమతి.. వంటి ఆశాజనక ప్రకటనలతో సైబర్‌ మోసగాళ్లు వల వేస్తుంటారని, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ డా. వినీత్‌ సూచించారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉద్యోగాలు, పెట్టుబడులు, రుణాలు, బంగారం, స్థలాలు, ఆన్‌లైనన్‌ వ్యాపారాలు, లక్కీడ్రాలు, విదేశీ ఉద్యోగాల పేరిట మోసాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకొని డబ్బులు అడగడం, ఫేక్‌ ప్రొఫైళ్లతో స్నేహం చేసి ఆర్థిక సాయం కోరడం, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించడం, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయమని చెప్పి ఖాతాలోని నగదు దోచుకోవడం వంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌, లింకులు, మెస్సేజ్‌లు, యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని విదేశీ ఉద్యోగాలు, ప్రైవేట్‌ కంపెనీల్లో నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ముందస్తు డబ్బులు వసూలు చేసే మోసాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలను మాత్రమే సంప్రదించాలని, ముందుగానే డబ్బులు అడిగే సంస్థలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా చీటింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించినా, మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. చీటింగ్‌, సైబర్‌ నేరాలకు పాల్పడే వారిపై జిల్లా పోలీస్‌శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement