రాజకీయ సమీకరణాల ప్రభావమా..
నేటికీ పూర్తికాని నియామకాలు
● ఉమ్మడి జిల్లాలో 5,013 మందికి
అవకాశం.. ఆదేశాల కోసం నిరీక్షణ
● గ్రామపంచాయతీల్లో ఖాళీగా
సలహాదారుల కుర్చీలు
● పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న ఒకటి.. అమలవుతున్నది మరోటి
ప్రతి గ్రామపంచాయతీకి ముగ్గురు చొప్పున కో–ఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియ చేపడతాం.
– వెంకట్రాములు, డీపీఓ, నారాయణపేట
నారాయణపేట/మరికల్: గ్రామపంచాయతీ పాలనలో అనుభవజ్ఞులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణా పంచాయతీరాజ్ చట్టం–2018లో పొందుపర్చిన కో–ఆప్షనన్ సభ్యుల నియామక ప్రక్రియ ఆచరణలో మాత్రం ముందుకు కదలడం లేదు. పాలకవర్గాలు ఏర్పడి ఆరు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1,671 గ్రామపంచాయతీలకు నియమించాల్సిన 5,013 మంది కో–ఆప్షనన్ సభ్యుల ఎన్నిక నిలిచిపోయింది. గ్రామాభివృద్ధికి సలహాదారులుగా ఉండాల్సిన వ్యవస్థ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామపాలనలో ప్రజల అనుభవాన్ని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కో–ఆప్షనన్ సభ్యుల వ్యవస్థ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. గ్రామపంచాయతీ పాలకవర్గాలు ఏర్పడి ఆరునెలలు గడిచినా కో–ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియపై ప్రభుత్వం మౌనం పాటిస్తుండటంతో వేలాది మంది ఆశావహుల నిరీక్షణ కొనసాగుతోంది. చట్టం ప్రకారం పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నా.. గడువు దాటి నాలుగు నెలలు అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ఆలస్యం కేవలం పదవుల నియామకానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. గ్రామ పాలనలో అనుభవజ్ఞులు, సామాజిక కార్యకర్తలు, దాతలు, ప్రవాస భారతీయుల భాగస్వామ్యాన్ని కోల్పోవడమేనని స్థానిక సంస్థల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో అనుభవం, సేవాభావం ఉన్న వ్యక్తులను పాలనలో భాగం చేయడంతో అభివృద్ధి ప్రణాళికలకు నాణ్యత పెరగాలనేది దీని ఉద్దేశం.
ప్రతి గ్రామపంచాయతీలో ముగ్గురికి..
పదవీ విరమణ చేసిన ఉద్యోగి లేదా అనుభవజ్ఞుడైన సీనియర్ సిటిజనన్, గ్రామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామసమాఖ్య అధ్యక్షురాలు, గ్రామాభివృద్ధికి దోహదపడిన ఎన్‌ఆర్‌ఐ, దాత లేదా స్థలం ఇచ్చిన వ్యక్తి. వీరికి వార్డు సభ్యులతో సమాన ప్రొటోకాల్, సమావేశాల్లో పాల్గొనే హక్కు ఉంటుంది. అయితే తీర్మానాలపై ఓటు హక్కు ఉండదు.
ఎందుకు కీలకం..?
గ్రామాల్లో చాలామంది పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, అధికారులు, ఇంజినీర్లు, బ్యాంకు ఉద్యోగులు, వ్యవసాయ నిపుణులు ఉన్నారు. వారి అనుభవాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని రూపొందించారు. గ్రామాల్లో నిధుల వినియోగం, చెరువుల పునరుద్ధరణ, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యరంగాల్లో అనుభవజ్ఞుల సూచనలు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే నియామకాలు జరగకపోవడంతో ఆ అవకాశం వృథా అవుతోంది.
మరికల్
గ్రామపంచాయతీ కార్యాలయం
ఎన్నికల తర్వాత కో–ఆప్షనన్ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు గ్రామ పెద్దలు, పదవీ విరమణ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. గ్రామాభివృద్ధిలో తమ అనుభవాన్ని వినియోగించుకునే అవకాశం వస్తుందని భావించిన వారు ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.
గ్రామపంచాయతీల్లో కో–ఆప్షనన్ సభ్యుల ఎంపిక అధికార, ప్రతిపక్ష వర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం ఉంది. గ్రామస్థాయిలో సామాజిక సమతుల్యత, రాజకీయ సమీకరణలు, స్థానిక ప్రభావాలు కూడా ఈ ఎంపికల్లో కీలకంగా మారుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయలేదనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.


