● కలెక్టర్ ప్రతీక్ జైన్
నారాయణపేట: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో నాటేందుకు మొక్కలను సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో మొక్కల పెంపకం.. లక్ష్యాలపై జిల్లాస్థాయి పర్యవేక్షణ సమన్వయ కమిటీ సమావేశం, అలాగే చిత్తడి నేలలు డీమ్డ్ ఫారెస్ట్‌లపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 12.71 లక్షల మొక్కలు నాటడం లక్ష్యమని, శాఖల వారీగా వారి లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. వన మహోత్సవంలో నాటేందుకు పొడవాటి మొక్కలు, పూల మొక్కలు, మల్బరీ మొక్కలు, పండ్ల మొక్కలను నిల్వ చేసుకోవాలన్నారు. అంతకుముందు వెట్ ల్యాండ్ డీమ్డ్ ఫారెస్ట్ అంశంపై మాట్లాడుతూ.. జిల్లాలోని 375 చెరువులను సర్వేచేసి సరిహద్దులు నిర్ణయించాలని తెలిపారు. రెవెన్యూ, నీటిపారుదల, అటవీశాఖల అధికారులు సమన్వయంతో హద్దులు నిర్ణయించాలన్నారు. శిఖం, పట్టా భూముల వివరాలు నమోదు చేయాలని కోరారు. వారం రోజుల్లో మళ్లీ సమావేశం ఏర్పాటు చేసుకుందామని.. అంతలోపు ఎన్ని చెరువులకు హద్దులు చేస్తారో చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను, ఆర్డీఓ రాంచందర్‌నాయక్, అటవీశాఖ అధికారి సత్యనారాయణ, నీటిపారుదలశాఖ, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’కి ప్రాధాన్యం..
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి అదనపు కలెక్టర్‌తో కలిసి హాజరై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను సావధానంగా విన్నారు. అనంతరం పరిష్కారానికి అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు సిఫారస్ చేశారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. కాగా ప్రజావాణికి మొత్తం 28 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బసవేశ్వరుడి బోధనలుఅనుసరణీయం..
కుల, మత, లింగ భేదాలను తీవ్రంగా వ్యతిరేకించి సమాజంలో సీ్త్రలకు సమాన హక్కులు ఉండాలని నినదించిన బసవేశ్వరుడి బోధనలు అనుసరణీయమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై బసవేశ్వరుడి చిత్రపటానికి జిల్లా అధికారులు, వీరశైవ సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బసవన్న తన వచన సాహిత్యంతో ప్రజలందరిని కులమతాలకు అతీతంగా ఏకం చేశారన్నారు. ఆయన బోధనల్లోని సమదృష్టి ఎందరినో ఆకర్షించిందని, సూక్ష్మమైన తత్వం సులువుగా బోధపడేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, పలువురు జిల్లా అధికారులు, వీరశైవ సంఘం నేతలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


