మక్తల్: ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం అవగాహన లేదని, ఏ సమయంలో ఏ పనులు చేయాలనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మక్తల్–నారాయణపేట రోడ్డు మరమ్మతుకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేసి రూ.200 కోట్లు మంజూరు చేశారని చెప్పుకుంటున్న నాయకులు ఇంతవరకు పనులు ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. సంగంబండ రిజర్వాయర్‌లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, అయినా మంత్రి తనకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేసిన అభివృద్ధి పనులనే కాంగ్రెస్ నాయకులు మళ్లీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ అభివృద్ధికి సహకరిస్తుంది కానీ అడ్డుకోదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి చేయడం చేతకాక బీఆర్‌ఎస్‌పై బురద జల్లుతుందని దుయ్యబట్టారు. సమావేశంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నర్సింహగైడ్, బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్‌గుప్తా, అన్వర్, చిన్నహన్మంతు, ఈశ్వర్,శివారెడ్డి, మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.
వరి (సోనారకం)
క్వింటా రూ.2,433
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం వరి ధాన్యం (సోనారకం) క్వింటా గరిష్టంగా రూ.2,433, కనిష్టంగా రూ.1,640 ధరలు పలికాయి. అదేవిధంగా ఎర్ర కంది సరాసరిగా రూ.6,899, ఆలసందలు గరిష్టంగా రూ.5,169, కనిష్టంగా రూ.5,079 ధరలు లభించాయి.
ఆర్‌ఎన్‌ఆర్ రూ.2,300..
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో సోమవారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,300, కనిష్టంగా రూ.1,980గా ధరలు లభించాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,739, కనిష్టంగా రూ.1,600, ఆముదాలు గరిష్టంగా రూ.6,100, కనిష్టంగా రూ.6,091గా ధరలు నమోదయ్యాయి. సీజన్ కావడంతో మార్కెట్‌కు దాదాపు 6 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
● గద్వాల మార్కెట్ యార్డులో వేరుశనగ గరిష్టంగా రూ.6,325, కనిష్టంగా రూ.4,280, ఆముదాలు గరిష్టంగా రూ.6,069, కనిష్టంగా రూ.5,921, కంది గరిష్టంగా రూ.6,506, కనిష్టంగా రూ.6,259, వరి (సోనా) గరిష్టంగా రూ.2,309, కనిష్టంగా రూ.1,709 ధరలు లభించాయి.
ఓపెన్ స్కూల్
పరీక్షలు ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్‌లో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1,329 మంది విద్యార్థులకు 1,250 మంది హాజరయ్యారు. ఇక ఎస్సెస్సీలో 19 పరీక్ష కేంద్రాలు ఉంటే 836 మందికి 725 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు రెండు ఫ్లయింగ్‌స్క్వాడ్స్, 15 మంది సిట్టింగ్‌స్క్వాడ్స్‌ను నియమించారు.
ఎస్సీ గురుకులాల్లో దరఖాస్తుల స్వీకరణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ఐదు మినీ గురుకులాల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్‌లాక్ సీట్ల భర్తీకి ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్టీ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలని, వచ్చే నెల 5వ తేదీ వరకు చివరి అవకాశం ఉందని పేర్కొన్నారు. 11వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, 12వ తేదీన అడ్మిషన్ల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
‘22 వరకు
దరఖాస్తు చేసుకోవాలి’
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో ఉన్న మెకానికల్, సివిల్, ఎలక్ట్రిల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మోహన్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 22వ తేదీ వరకు అవకాశం ఉందని, వచ్చేనెల 13న పాలిసెట్ ఎంట్రెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


