మక్తల్: స్థానిక పురపాలికలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఎర్కలి సత్యమ్మ కాంగ్రెస్ అభ్యర్థి ఎర్కలి మారెప్పపై 37 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన పుర ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి ఎర్కలి మహదేవప్ప పోలింగ్‌కు ఒకరోజు ముందు ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నికల అధికారులు వాయిదా వేశారు. తిరిగి శనివారం ఎన్నిక నిర్వహించి సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 1,453 ఓట్లకుగాను 1,294 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీజేపీ అభ్యర్థికి 628, కాంగ్రెస్ అభ్యర్థికి 591, బీఆర్‌ఎస్ అభ్యర్థికి 46, నోటాకు నాలుగు, చెల్లని ఓట్లు 25 ఉన్నట్లు ఎన్నికల అధికారులు వివరించారు. 37 ఓట్ల మెజార్టీతో ఎర్కలి సత్యమ్మ విజయం సాధించినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఉప ఎన్నికను అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి పర్యవేక్షించారు.


