తాగునీటికి ఢోకా లేనట్టే! | - | Sakshi
Sakshi News home page

తాగునీటికి ఢోకా లేనట్టే!

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

‘మిషన్‌ భగీరథ’కు కేఎల్‌ఐ ద్వారా ఎత్తిపోతలు

తగ్గుతున్న నీటిమట్టం..

ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు..

ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో

820 అడుగుల నీటిమట్టం

800 అడుగుల వరకు నీటిని

ఎత్తిపోసుకునే అవకాశం

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా

అధికారుల చర్యలు

కొల్లాపూర్‌: శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌ లెవెల్స్‌ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్‌ భగీరథ పథకానికి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కొల్లాపూర్‌ మండలం ఎల్లూరులో ఏర్పాటుచేసిన మిషన్‌ భగీరథ స్కీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 84 మండలాలకు తాగునీరు అందుతోంది. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.

సరఫరా ఇలా..

ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరులో మిషన్‌ భగీరథ పంప్‌హౌజ్‌ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్‌లైన్లు, వాటర్‌ట్యాంకులు నిర్మించి.. నీటి సరఫరా చేస్తున్నారు.

రోజూ 0.02 టీఎంసీలు అవసరం..

మిషన్‌ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీల నీరు అవసరం. కేఎల్‌ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒకసారి రిజర్వాయర్‌ను నింపితే.. దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. అయితే వేసవిలో ఎల్లూరు రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుజాగ్రత్తగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో 4 టీఎంసీలకు పైగా నీటిని నిల్వచేసి ఉంచారు. ఈ నీటిని మిషన్‌ భగీరథకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నపుతండా వద్ద రూ. 10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెగ్యులేటరీ సిస్టమ్‌ పనులు కూడా తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే ఇకనుంచి రెగ్యులర్‌గా నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచే మిషన్‌ భగీరథకు నీటిని సరఫరా చేయవచ్చు. ఇది అమలైతే కేఎల్‌ఐ ప్రాజెక్టుపై ఇన్నాళ్ల నుంచి పడుతున్న ఒత్తిడి తగ్గుతోంది.

కృష్ణానదిలో కొన్ని రోజులుగా నీటిమట్టం భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల మేరకు నీటిమట్టం ఉంది. మిషన్‌ భగీరథ కోసం 800 అడుగుల వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. యాసంగి సీజన్‌ ముగింపునకు చేరడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం మిషన్‌ భగీరథ కోసమే నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్‌ఐ ప్రాజెక్టు వద్ద 820 అడుగుల మేరకు కృష్ణా బ్యాక్‌వాటర్‌ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాల మేరకు ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణా బ్యాక్‌వాటర్‌ నిల్వలు, మిషన్‌ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి మిషన్‌ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఇక ఢోకా ఉండదు.

– అంజాద్‌ పాషా,

డీఈఈ, మిషన్‌ భగీరథ

Advertisement
 
Advertisement
Advertisement