● కలెక్టర్ ప్రతీక్ జైన్
నారాయణపేట: జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్‌లతో పాటు అదనంగా మరో పది రీచ్‌లను ఏర్పాటు చేసి మన ఇసుక.. మన వాహనం ద్వారా రవాణాకు ఆన్‌లైన్ అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఆయన అధ్యక్షతన డీఎల్‌ఎస్‌సీ (డిస్ట్రిక్ట్ లేవల్ సాండ్ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని వర్కూరు పరిధిలో ఉన్న నాలుగు రీచ్‌లతో పాటు ఉట్కూర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి రీచ్ నుంచి ఇసుక రవాణాకు ఆన్‌లైన్ అనుమతులు జారీ చేస్తున్నామని చెప్పారు. ఇకపై జిల్లాలో గుర్తించిన మరో పది ఇసుక రీచ్‌ల నుంచి కూడా ఇసుక తరలింపునకు అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా రీచ్‌లను కేఏంఎల్ మ్యాపింగ్ చేసి రెవెన్యూ, మైనింగ్, భూగర్భ జలవనరులు, నీటిపారుదలశాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే అమ్మికుంట, నేరెడుగాం, సంగంబండ, ముశ్రీఫా, రాకొండ(చెక్ డ్యాం) పరిధిలోనూ ఇసుక లభ్యత, రవాణాపై అధికారులు క్షేత్రసాయి పరిశీలన చేయాలని సూచించారు. గతంలో 21 రీచ్‌లు ఉండగా.. ఇప్పుడు నాలుగైదు రీచ్‌లను గుర్తించడం ఏమిటని, కనీసం 18 రీచ్‌ల నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో మన రాష్ట్ర పరిధి ముగింపు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇదే నెలలో మరోమారు నిర్వహించే సమావేశంలో పది రీచ్‌ల నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రెడ్డి, మైనింగ్ ఏడీ గోవిందరాజు, భూగర్భ జలవనరులశాఖ ఏడీ రవి, నీటిపారుదలశాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, ధన్వాడ, మరికల్, ఊట్కూర్, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.


