రోడ్డుభద్రత నియమాలు పాటిద్దాం | - | Sakshi
Sakshi News home page

రోడ్డుభద్రత నియమాలు పాటిద్దాం

Apr 19 2026 7:29 AM | Updated on Apr 19 2026 7:29 AM

జోగుళాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌

నారాయణపేట: రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పాటిస్తూ.. ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జోగుళాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ కోరారు. అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లాకేంద్రంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆయనతో పాటు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎస్పీ డా. వినీత్‌తో పాటు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ మార్కెట్‌ యార్డ్‌ నుంచి ప్రారంభమై అంబేడ్కర్‌ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా, యాద్గిర్‌ రోడ్‌, పాత బస్టాండ్‌, సెంటర్‌ చౌక్‌ మీదుగా శ్రీ గార్డెన్‌ వరకు కొనసాగింది. అనంతరం శ్రీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఐజీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని.. ట్రాఫిక్‌ నియమాలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్‌ విధిగా ధరించాలని సూచించారు. మద్యం తాగి, మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదన్నారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు.

ఇంటికి సురక్షితంగా చేరుకోవాలి..

ప్రజలు ఇంటి నుంచి వెళ్లి తిరిగి సురక్షితంగా చేరుకోవడమే అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అన్నారు. సమాజంలో మార్పునకు యువత ముందుకు రావాలని కోరారు. ఎస్పీ డా. వినీత్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఏటా 100కు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఆ సంఖ్య తగ్గించాలంటే డిఫెనన్స్‌ డ్రైవింగ్‌ అలవాటు చేసుకోవాలని, డ్రైవింగ్‌ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దైనందిన జీవితంలో రోడ్డు భద్రతను భాగం చేసుకోవాలని, ట్రాఫిక్‌ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్‌ హుల్‌హక్‌, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్‌, సీఐలు శివశంకర్‌, సైదులు, భగవంత్‌రెడ్డి, ఆర్‌ఐ విజయభాస్కర్‌, ఆర్టీఓ సభ్యుడు పోషల్‌ రాజేష్‌, కౌన్సిలర్‌ మహేష్‌, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాజు, రమేష్‌, సతీష్‌రెడ్డి, వెంకటేష్‌గౌడ్‌, నరేష్‌, బాలరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement