స్టేషన్ మహబూబ్‌నగర్: డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో లింక్‌పెట్టడం సరికాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్‌లో బిల్లు వీగిపోవడం నియంతృత్వ ధోరణితో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. 46 ఏళ్ల బీజేపీ ఒక్క మహిళను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా చేయలేదని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడున్న 543 సీట్లలో ఇది వరకు ఆమోదం పొందిన మహిళా బిల్లు ప్రకారం రిజర్వేషన్‌లు వచ్చే ఎన్నికల్లో అమలయ్యేలా బిల్లు పెడితే బేషరుతుగా మద్దతు ఇస్తామని, మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి స్టాండ్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్–ఇండియా విభజనతో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పోల్చి ఇక్కడి ప్రజలను అవమానపరిచారని, దీనిని సహించేది లేదన్నారు. ఆ ఎంపీ తెలంగాణ పట్ల మాట్లాడిన మాటలను పార్లమెంట్ రికార్డులో తొలగించే బాధ్యత ఇక్కడి బీజేపీ ఎంపీలపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ముగిసిన
పుర 6వ వార్డు పోలింగ్
మక్తల్: పుర పరిధిలోని 6వ వార్డు ఎన్నిక శనివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగగా.. 13, 14 పోలింగ్ కేంద్రాల్లో 1,294 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 680, మహిళలు 614 మంది ఉండగా.. 89 శాతం పోలింగ్ నమోదైంది. అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి చందాపూర్‌లో కేంద్రాన్ని తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించారు. అదేవిధంగా ఎస్పీ డా. వినీత్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించలేదు. సీఐ రాంలాల్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, కృష్ణా ఎస్‌ఐ నవీద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తిర్మలాపూర్ ఓటర్లు చందాపూర్‌కు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పాలిసెట్‌కు
దరఖాస్తు చేసుకోండి
కోస్గి రూరల్: పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష రాసేందుకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు శనివారం తెలిపారు. ప్రవేశ పరీక్షకు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తోందన్నారు. తక్కువ సమయంలోనే సాంకేతిక నైపుణ్యాలతో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని వివరించారు.


