చిన్నచింతకుంట: మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపురం అమరచింత, ఆత్మకూర్ సంస్థానాల పాలన కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిగి ఉన్న అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల కాలం వరకు ముక్కెర వంశీయులు పరిపాలించారు. 1268 నుంచి 1948 వరకు వీరి పరిపాలన కొనసాగింది. ఇది 19వ శతాబ్దంలో భారత యూనియన్‌లో విలీనమైంది. కురుమూర్తి స్వామి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీద్‌తో పాటు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి.


