బడి.. భద్రత | - | Sakshi
Sakshi News home page

బడి.. భద్రత

Apr 18 2026 7:59 AM | Updated on Apr 18 2026 7:59 AM

నర్వ: విద్యా సంవత్సరం ఈ నెల 23న ముగుస్తుండగా.. 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. సెలవు రోజుల్లో పాఠశాలలు సురక్షితంగా ఉండేలా 20 విభాగాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మౌలిక వసతులు, రికార్డులు, భద్రత వ్యవస్థలను పటిష్టం చేయాలంటూ సమగ్రశిక్ష తెలంగాణ ప్రాజెక్టు డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ జిల్లా విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌, కేజీబీవీ అధికారులకు కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. పీఎంశ్రీ, సమగ్రశిక్ష నిధుల ద్వారా పాఠశాలలకు ప్రింటర్లు, కంప్యూటర్లు, సంగీత పరికరాలు, బ్యాండ్‌ సామగ్రి, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌, క్రీడా పరికరాలు, లైబ్రరీ, వసతులు, ఒకేషనల్‌ సాధనాలు, మధ్యాహ్న భోజన వంటగది, ఫర్నీచర్‌ తదితర అనేక వసతులు కల్పించారు. వీటి రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించారు. ఏ విధమైన ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఫోన్‌నంబర్ల ప్రదర్శన..

అత్యవసర సమయాల్లో స్పందించేలా పోలీస్‌, ఫైర్‌, విద్యుత్‌శాఖల కాంటాక్ట్‌ నంబర్లు స్కూల్‌ ఆవరణలో ప్రదర్శించాల్సి పేర్కొన్నారు. డిజిటల్‌ సెక్యూరిటీ కోసం పరికరాలను ఆఫ్‌చేసి కవర్‌ చేయడం, ముఖ్యమైన డేటాను బ్యాకప్‌ చేయడం, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన వంటశాలలను శుభ్రపర్చడం, సరుకులను సురక్షితంగా నిల్వచేయడం, ఎల్పీజీ సిలిండర్లను ఆఫ్‌ చేయడం, సెక్యూర్‌ చేయడం తప్పనిసరి. వర్షాలు, గాలివాన వంటి విపత్తులకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సెలవుల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని నియమించి వారి కాంటాక్ట్‌ వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేయాలని వివరించారు.

పునః ప్రారంభం నాటికి..

జూన్‌లో పాఠశాలలు తిరిగి తెరవడానికి ముందు శుభ్రత, తాగునీరు, శానిటేషన్‌, భద్రత అంశాలపై పూర్తి తనిఖీ చేసి రెడీనెస్‌ రిపోర్టును ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశించారు. ఏదైనా నష్టం, దొంగతనం, అవాంచనీయ ఘటన జరిగితే వెంటనే నివేదించాలని, ఫిర్యాదుల రిపోర్టు సెలవుల ముందు, తర్వాత అందజేయాలని పేర్కొన్నారు. పాఠశాలల ఆస్తుల సంరక్షణలో నిర్లక్ష్యం కనబరిస్తే ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌ బాధ్యులని స్పష్టం చేస్తూ డీఈఓలకు ఆదేశాలు జారీ చేస్తూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

నర్వ మండలం పెద్దకడ్మూర్‌ పీఎంశ్రీ పాఠశాలలో

కంప్యూటర్‌ ల్యాబ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ (ఫైల్‌)

ముందస్తు జాగ్రత్తలు..

పాఠశాలల సమగ్ర భద్రతలో భాగంగా పాఠశాలల గేట్లు, తరగతి గదులు, ల్యాబ్‌లకు తాళాలు వేయడంతో పాటు రక్షణకు స్థానిక పోలీసులు, పూర్వ విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. విలువైన పరికరాలను పటిష్ట గదుల్లో భద్రపర్చడం, ఆస్తుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం, అనధికార ప్రవేశాన్ని నియంత్రించడం తప్పనిసరి చేయాలన్నారు. విద్యుత్‌ ప్రమాదాలను నివారించేందుకు పరికరాలు, మెయిన్‌ పవర్‌ స్విచ్ఛాఫ్‌ చేయడం, లోపాలున్న వైరింగ్‌ను ముందుగానే సరి చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛతలో భాగంగా టాయిలెట్లు, నీటిట్యాంకులు శుభ్రపర్చడం, లీకేజీలు లేకుండా చూడటం, దోమల వృద్ధిని అరికట్టేందుకు నీటి నిల్వలను తొలగించాలని చెప్పారు. క్యాంపస్‌ పరిశుభ్రత, చెత్త నిర్వహణ, రికార్డులను లాకర్లలో భద్రపర్చడం, డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడం వంటి అంశాలను కూడా సూచించారు. ప్రధానోపాధ్యాయులు సెలవుల్లో కూడా పాఠశాలలను పర్యవేక్షిస్తూ వాచ్‌మెన్‌ లాగ్‌బుక్‌ నిర్వహించాలని తెలిపారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలతో సమన్వయం కొనసాగిస్తూ బడి మూసివేత విషయాన్ని స్థానికులకు తెలియజేయాలని సూచించారు.

ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు

కంప్యూటర్లు, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లో విలువైన పరికరాలు

రక్షణకు సీసీ టీవీ,

డిజిటల్‌ భద్రతకు ప్రాధాన్యం

జిల్లా విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు

Advertisement
 
Advertisement
Advertisement