నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుదాం | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుదాం

Apr 18 2026 7:59 AM | Updated on Apr 18 2026 7:59 AM

గోల్డెన్‌ అవర్‌ సాయంపై

అవగాహన కలిగి ఉండాలి

ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(ఐజీ) డా. గజరావు భూపాల్‌

కొత్తకోట రూరల్‌: ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించి క్షేమంగా ఇంటికి చేరుకునేలా అవగాహన కల్పించడమే ‘అరైవ్‌–అలైవ్‌’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజీ) డా. గజరావు భూపాల్‌ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కొత్తకోటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు చేయా ల్సిన గోల్డెన్‌ అవర్‌ రెస్పాన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐజీతో పాటు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, నారాయణపేట ఎస్పీ వినీత్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డ్రైవర్లు, విద్యార్థులు, ప్రజలు హాజరుకాగా.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గోల్డెన్‌ అవర్‌ లో స్పందించాల్సిన తీరు, సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. అదేవిధంగా డ్రైవర్లకు నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సందర్శించి రోడ్డు భద్రతపై పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 50 శాతం మత్యువాత చెందుతున్న వారు ద్విచక్ర వాహనదారులేననని, అందులో 18 నుంచి 40 ఏళ్లలోపు వారేనని తెలిపారు. కాబట్టి ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్‌ ధరించాలని సూచించారు. అత్యధిక దూరం ప్రయాణించేవారు బైక్‌లు వినియోగించకుండా ఇతర మార్గాలు ఎంచుకోవాలని, అత్యధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు నెలల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 మందికి పైగా దుర్మరణం చెందారని.. ఇది అత్యంత బాధాకరమన్నారు. రాంగ్‌ రూట్‌లో ప్రయాణించడం సరైన పద్ధతి కాదని, సరైన మార్గంలో ప్రయాణించి క్రమశిక్షణగా నడుచుకోవాలని సూచించారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్పత్రికి తరలించే మొదటి క్షణాల్లో క్షతగాత్రులకు అందించాల్సిన సాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అలా చేసిన వారికి ప్రభుత్వం నగదు బహుమతి అందిస్తుందని వివరించారు.

నారాయణపేట ఎస్పీ డా. వినీత్‌ మాట్లాడుతూ.. దేశంలో ఏడాదికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే, అందులో 1.20 లక్షల మంది మృతి చెందుతున్నారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు సరైన చికిత్స అందిస్తే మృతుల సంఖ్య చాలా వరకు తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌, కొత్తకోట పుర చైర్‌పర్సన్‌ పి.అరుణ, వైస్‌ చైర్‌పర్సన్‌ పి.పల్లవి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పి.ప్రశాంత్‌, సీఐ రాంబాబు,ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement