కోస్గి రూరల్: రైతులు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక, అధిక ఆదాయం వచ్చే ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ సూచించారు. శుక్రవారం గండుమాల్ మండలం హన్మన్‌పల్లి రైతువేదికలో రైతులకు సమగ్ర వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆయన హాజరై మాట్లాడారు. రైతులు తమ పొలాల్లో గొర్రెల మందలను నిలుపడంతో సారవంతం అవుతుందని, రసాయన ఎరువులను తగ్గించి సహజ ఎరువులను వినియోగించి నేల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. ఆయిల్‌పాం తోటల్లో పత్తి, కంది అంతర పంటగా వేసుకోవడంతో అదనపు ఆదాయం పొందవచ్చని, నానో యూరియా, డీఏపీతో ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు పంటకు సమతుల పోషకాలు అంది దిగుబడులు పెరుగుతాయని చెప్పారు. అనంతరం కోస్గి పుర పరిధిలోని మాసాయిపల్లిలో ఉన్న వెంకటయ్యగౌడ్ ఆయిల్‌పాం తోటను సందర్శించారు. సాగు విధానం, నిర్వహణ, దిగుబడి, ఉప ఉత్పత్తులతో వచ్చే ఆదాయం తదితర వివరాలను రైతులకు తెలియజేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయిల్‌పాం ప్రాసెసింగ్ పరిశ్రమను స్థాపించేందుకు హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతులు ఆయిల్‌పాం సాగుకు మొగ్గు చూపాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ రామకృష్ణ, ఏఈఓలు నరేందర్, అజయ్, ఉద్యానశాఖ, ఆయిల్‌ఫెడ్ సిబ్బంది పాల్గొన్నారు.


